AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి.. NIA అధికారుల అదుపులో రాణా

26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారతదేశానికి రప్పించారు. NIA అతన్ని అరెస్టు చేసింది. పాటియాలా హౌస్ కోర్టు అతన్ని 18 రోజుల రిమాండ్‌కు పంపింది. రాణాను ప్రత్యేక గల్ఫ్‌స్ట్రీమ్ విమానంలో భారతదేశానికి తీసుకువచ్చారు. రానా భారతదేశానికి ఎలా చేరుకున్నాడో తెలుసుకుందాం.

ఎట్టకేలకు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి.. NIA అధికారుల అదుపులో రాణా
Rana
Balaraju Goud
|

Updated on: Apr 11, 2025 | 7:43 AM

Share

ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి, ఉగ్రవాది తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశానికి చేరుకున్న తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచారు. పాటియాలా హౌస్ కోర్టు రాణాను 18 రోజుల రిమాండ్‌కు పంపింది. ఐఎస్ఐలో పనిచేసి, లష్కరే తోయిబా, హర్కత్-ఉల్-జిహాదీ ఇస్లామీ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్న తహవ్వూర్ రాణాను ప్రత్యేక విమానంలో భారతదేశానికి తీసుకువచ్చారు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో భారతదేశానికి చేరుకున్న రాణాను.. UAPA కింద NIA బృందం అధికారికంగా అరెస్టు చేసింది.

NIA రాణాను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. ఈ సమయంలో, ముంబై దాడులలో అతని ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పించారు. 26/11 ముంబై దాడులకు సంబంధించి రాణా పంపిన ఈమెయిల్స్ సహా కేసుతో సంబంధం ఉన్న బలమైన ఆధారాలను పాటియాలా హౌస్ కోర్టుకు సమర్పించింది NIA. ఉగ్ర కుట్రను వెలికితీయడానికి కస్టోడియల్ విచారణ చాలా కీలకమని కోర్టుకు తెలిపింది. ఉగ్రవాద దాడులను నిర్వహించడంలో రాణా పాత్రపై NIA అధికారులు మరింత లోతుగా దర్యాప్తు జరపనున్నారు.

పాకిస్తాన్‌లో జన్మించిన కెనడియన్ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో కీలక నిందితుడు గురువారం(ఏప్రిల్ 10) అమెరికా నుండి రహస్యంగా చార్టర్డ్ బిజినెస్ జెట్‌లో న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. మీడియా కథనాల ప్రకారం, ఈ అప్పగింత ఆపరేషన్ గల్ఫ్‌స్ట్రీమ్ G550 ఉపయోగించి జరిగింది. ఈ విమానాన్ని వియన్నాకు చెందిన చార్టర్ సర్వీస్ నుండి అద్దెకు తీసుకున్నారు. ఈ జెట్ బుధవారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.15 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 11.45 గంటలకు) ఫ్లోరిడాలోని మయామి నుండి బయలుదేరింది. అదే రోజు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు) రొమేనియాలోని బుకారెస్ట్‌లో అది ల్యాండ్ అయింది. దాదాపు 11 గంటల పాటు రొమేనియన్ రాజధానిలో నిలిపివేశారు. గల్ఫ్‌స్ట్రీమ్ గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.15 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 8.45) బుకారెస్ట్ నుండి బయలుదేరి నేరుగా న్యూఢిల్లీకి బయలుదేరింది. అక్కడ గట్టి భద్రత మధ్య ల్యాండ్ అయింది. రాణా ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే, జాతీయ దర్యాప్తు సంస్థ అతన్ని అధికారికంగా అరెస్టు చేసింది.

భారత దర్యాప్తు సంస్థ NIA 2011 సంవత్సరంలో తహవ్వూర్ రాణాపై తన చార్జిషీట్ దాఖలు చేసింది. దీని తరువాత, 2019 డిసెంబర్ 4న మొదటిసారిగా, దౌత్య మార్గాల ద్వారా రాణాను అప్పగించాలని భారతదేశం డిమాండ్ చేసింది. జూన్ 10, 2020న రాణాను తాత్కాలికంగా అరెస్టు చేయాలని డిమాండ్ చేయగా, జూన్ 22, 2021న అమెరికా ఫెడరల్ కోర్టులో తహవ్వూర్ రాణాను అప్పగించడంపై విచారణ సందర్భంగా భారతదేశం ఆధారాలను సమర్పించింది.

రెండు సంవత్సరాల క్రితం, మే 16, 2023న, కాలిఫోర్నియా జిల్లా కోర్టు అతన్ని అప్పగించాలని ఆదేశించింది. దీని తరువాత, తహవూర్ అమెరికాలోని అనేక కోర్టులలో అప్పీల్ దాఖలు చేశాడు. కానీ అతని పిటిషన్లన్నీ తిరస్కరించారు. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం అతన్ని భారతదేశానికి పంపవచ్చని కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది.

గత సంవత్సరం, రాణాను అప్పగించాలన్న భారతదేశం చేసిన అభ్యర్థనకు అమెరికా ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. నవంబర్ 13న, రానా US సుప్రీంకోర్టులో రిట్ ఆఫ్ సర్టియోరారీ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. కానీ అది తిరస్కరణకు గురైంది. ఫిబ్రవరి 27న, అతను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలెనా కగన్ మార్చి 6న తిరస్కరించారు. ఈ తుది నిర్ణయం తర్వాత, రాణాను భారతదేశానికి తీసుకువచ్చారు.

తహవ్వూర్ రాణా భారతదేశానికి చేరుకున్న వెంటనే, అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత NIA అతన్ని కోర్టులో హాజరుపరిచింది. ఈ సమయంలో, ముంబై దాడులలో అతని ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పించారు. రాణా తరఫు న్యాయవాది పీయూష్ సచ్‌దేవా కోర్టులో వాదనలు వినిపించారు. NIA కోర్టును 20 రోజుల రిమాండ్ కోరింది. గంటల తరబడి మూసి తలుపుల మధ్య జరిగిన చర్చల తర్వాత, తెల్లవారుజామున 2:10 గంటలకు కోర్టు 18 రోజుల రిమాండ్ మంజూరు చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ వెంటనే రాణాను NIA ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈరోజు శుక్రవారం(ఏప్రిల్ 11) నుండి అతన్ని విచారిస్తారు. ఈ విచారణ ద్వారా, 17 ఏళ్ల నాటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని NIA ఆశిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..