తాకట్టుకు దేవుడి సొమ్ము !

శబరిమల, గురువాయూర్ ‌కృష్ణ ఆలయంతోపాటు, ట్రావెన్‌కోర్‌ దేవస్వొమ్‌ బోర్డు ఆధ్వర్యంలో నడిచే 1247 ఆలయాలు, సిబ్బంది జీతభత్యాలకు కూడా అవస్థలు పడుతున్నాయి. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు వందల ఏళ్ల ఆభరణాలను తాకట్టు పెట్టడానికి దేవస్థానాలు సిద్ధపడుతున్నాయి.

తాకట్టుకు దేవుడి సొమ్ము !

Updated on: Aug 27, 2020 | 9:50 AM

కరోనా మహమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలతో జనం ఇంట్లో నగలు తాకట్టు పెడుతున్నారు. సుధీర్ఘ కాలం లాక్ డౌన్ కొనసాగడం, అన్ లాక్ తర్వాత చేతినిండా పని లేకపోవడంతో ఆర్థిక బాధలు మొదలయ్యాయి. దీంతో మరోదారి లేక ఇంట్లో బంగారం బ్యాంకుల్లో కుదువపెడుతున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులు సాధారణ ప్రజలకే కాదు, ఆలయాలకు కూడా తప్పలేదు. ఆలయాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఏకంగా వందల ఏళ్లనాటి ఆలయ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడానికి దేవస్థానాలు సిద్ధమవుతున్నాయి. కేరళలోని శబరిమల ఆలయం కూడా ఇందుకు మినహాయింపు కాదు.

కేరళలోని అనేక ప్రముఖ ఆలయాలు కరోనా ఎఫెక్ట్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి ఏడాది మూడు కోట్ల మంది భక్తులు దర్శించే శబరిమల అయ్యప్ప ఆలయానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. గురువాయూర్‌లోని కృష్ణ ఆలయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. గురువాయూర్‌ కృష్ణ ఆలయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థతి.. ఆలయాలకు భక్తుల దర్శనం లేక ఐదు నెలలు గడిచిపోయాయి. భక్తులు లేక, ఆదాయం రాక, విరాళాలు అందక ఆలయాలన్నీ వెలవెలబోతున్నాయి. దేశంలోనే సంపన్న దేవస్థానాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

శబరిమల, గురువాయూర్‌ మాత్రమే కాదు, ట్రావెన్‌కోర్‌ దేవస్వొమ్‌ బోర్డు ఆధ్వర్యంలో నడిచే 1247 ఆలయాలు, సిబ్బంది జీతభత్యాలకు కూడా అవస్థలు పడుతున్నాయి. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు వందల ఏళ్ల ఆభరణాలను తాకట్టు పెట్టడానికి దేవస్థానాలు సిద్ధపడుతున్నాయి.

కేరళ ప్రభుత్వ నియంత్రణలో నడిచే ట్రావెన్‌కోర్‌ దేవస్వొమ్‌ బోర్డు, గోల్డ్‌ లోన్స్‌ కోసం రిజర్వు బ్యాంకును ఆశ్రయించింది. రూపాయి ఆదాయం లేకపోయినా..నెలనెలా సిబ్బంది జీతాలకు 50 కోట్లు ఖర్చవుతోందనీ వివరించింది. గోల్స్‌ కాయిన్స్‌, గోల్డ్‌ బార్స్‌, ఇతర ఆభరణాల రూపంలో ఉన్న 1000 కేజీల బంగారాన్ని కుదువ పెట్టడానికి సిద్ధమైంది.

 

దేశంలోనే పది ప్రఖ్యాత దేవస్థానం బోర్డులు ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. గోల్డ్‌ మోనెటైజేషన్‌ స్కీమ్‌ ఉపయోగించుకుని, 2.5 శాతం వడ్డీకి గోల్డ్‌ లోన్‌ తీసుకోవాల్సిందిగా అధికారులు దేవస్థానం అధికారులకు సూచించారు. వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సెల్‌ నివేదిక ప్రకారం, దేశంలోని ప్రఖ్యాత ఆలయాల్లో 8.8 మిలియన్‌ పౌండ్ల బంగారం ఉంది. శబరిమల ఆలయానికి గత సీజన్‌లో రోజుకు మూడుకోట్ల ఆదాయం వచ్చింది. ఇక వందల కిలోల బంగారానికి కొదువే లేదు.

అయితే భక్తులు భగవంతునికి సమర్పించిన ఆభరణాలను కుదువ పెట్టడం సమంజసం కాదంటున్నారు బీజేపీ నేతలు. న్యాయస్థానం అనుమతి లేకుండా ఆలయాల్లోని నగలను తాకట్టు పెట్టే అధికారం ట్రావెన్‌కోర్‌ దేవస్వొమ్‌కు లేదని వాదిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us