Srinagar Temple: జమ్మూలోని శ్రీనగర్‌లో ఉన్న హిందూ దేవాలయం 31 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. 80లలో మిలిటెన్సీ, ఘర్షణల కారణంగా ఆలయం మూతపడింది. అక్కడ హిందువులపై దాడులు జరిగాయి. కశ్మీరీ పండిట్లు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం మూతపడిపోయింది. అయితే ఇప్పుడు కశ్మీర్ లో పరిస్థితులు సద్దుమణిగిపోయాయి. దీంతో శ్రీనగర్‌లోని హబ్బా కదల్ ప్రాంతంలోని శీతల్‌నాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు తరలి రావడంతో ఆలయం తిరిగి తెరుచుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఆలయంలో వేద మంత్రలు వినిపించాయి.
ఈ ఆలయాన్ని తిరిగి తెరువడానికి స్థానిక ప్రజల నుంచి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజం నుంచి చాలా మద్దతు ఉన్నదని ఆలయానికి వచ్చిన భక్తుడు సంతోష్ రజ్దాన్ తెలిపారు. గతంలో ప్రజలు ఇక్కడ పూజలు చేయడానికి వచ్చేవారని, అయితే ఉగ్రవాదం కారణంగా ఈ ఆలయం మూసివేసినట్లు చెప్పారు. ఇక్కడి ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు మాకు ఎంతో సహాయం చేశారని, ఈ ఆలయం తిరిగి తెరిచేందుకు ముస్లిం సమాజం మాకు అవసరమైన సహాయం అందించిందని శీతల్‌నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న రవీందర్ రాజ్‌దాన్ అన్నారు. ఇక్కడి ముస్లింలు ఆలయాన్ని శుభ్రం చేయడానికి ముందుకు రావడమే కాకుండా.. పూజకు కావాల్సిన వస్తువులను కూడా తీసుకువచ్చారని తెలిపారు. ఏటా వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపేవారు. బాబా శీతల్నాథ్ భైరవ్ జన్మదినం వసంత పంచమి నాడే వస్తుండటం విశేషం.
2019 ఆగస్టు 5 న ఆర్టికల్-370 ను రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద హింస, రాళ్ళతో కొట్టే సంఘటనలు గణనీయంగా తగ్గిపోయాయి. 2019 లో 157 మంది ఉగ్రవాదులను నిరోధించినట్లు ఫిబ్రవరి 8 న కేంద్ర హోంమంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభకు తెలిపారు. ఈ సంఖ్య 2020 లో 221 కు పెరిగింది. 2019 లో 594 ఉగ్రవాద హింస కేసులు నమోదవగా.. ఈ సంఖ్య 2020 లో 244కు తగ్గాయి. అయతే 2020 లో 327 రాళ్ళు రువ్విన సంఘటనలు నమోదయ్యాయి.
కశ్మీర్‌లో వివాదాస్పదమైన 1987 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఉగ్రవాద సంఘటనలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు లభించింది. ఇది లోయలో హిందూ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించింది. కశ్మీరీ పండితులు ఇండ్లను విడిచి పారిపోవలసి వచ్చింది. ఒక అంచనా ప్రకారం, లోయలో 50 వేల దేవాలయాలు మూసివేతకు గురయ్యాయి. 2019 లో కేంద్ర ప్రభుత్వం వాటిని తిరిగి తెరిచినట్లు ప్రకటించింది.