రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీకి రక్తంతో లేఖలు రాసిన కర్ణాటక యువకుడు.. ఎందుకంటే?

|

Jul 24, 2021 | 12:54 PM

కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తదితరులకు తన రక్తంతో లేఖ రాశాడు. ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీకి రక్తంతో లేఖలు రాసిన కర్ణాటక యువకుడు.. ఎందుకంటే?
Cow Protection
Follow us on

కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తదితరులకు తన రక్తంతో లేఖ రాశాడు. ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా గో సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కార్వార్‌కు చెందిన రోషన్ తన లేఖలో కోరాడు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరాడు. కర్ణాటక గో వధ నిషేధ చట్టాలు పగడ్భందీగా అమలయ్యేలా చూడాలని తన లేఖలో కోరారు. దేశంలో గో వధ నిషేధ చట్టాలున్నా… విచ్చలవిడిగా గో మాంసం విక్రయిస్తున్నారని తన లేఖలో వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశంగా రోషన్ గతంలోనూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాశాడు. అయినా గో వధ కొనసాగుతుండటంతో మనోవేధనతో ఇప్పుడు వారికి తన రక్తంతో లేఖలు రాసినట్లు చెప్పాడు. గత ఐదారు సంవత్సరాలుగా రాష్ట్రపతి, ప్రధానికి ఈ విషయమై లేఖలు రాసినట్లు తెలిపాడు.

ఆవులను తాము దేవుడితో సమానంగా భావిస్తామని పేర్కొన్న రోషన్..అది హిందువుల సంస్కృతిలో భాగమయ్యిందన్నారు. ఆవులతో ప్రతి హిందువుకు ప్రత్యేక అనుబంధం ఉందని..మాంసం కోసం గోవులను వధించడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా, వధ కొనసాగుతోందని..దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా రక్తంతో రాసిన లేఖను పంపారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేందుకు చొరవ చూపాలని కోరాడు.

కర్ణాటకలో జరుగుతున్న గో సంరక్షణ ఉద్యమంలో రోషన్ చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ప్రాంతంలో పశువులను అక్రమంగా గోశాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణం స్పందించి గో సమితి సభ్యులతో కలిసి అక్కడ వాలిపోతాడు. మూగజీవాలకు విముక్తి కల్పించి గో సంరక్షణ కేంద్రానికి తరలిస్తాడు. గోవుల సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

చట్టవిరుద్ధంగా సాగుతున్న గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రోషన్ ప్రశ్నిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులతో రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేశారు. గో సంరక్షణ కోసం రోషన్ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు తన రక్తంతో లేఖలు రాయడం ఆ రాష్ట్ర మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read..

 భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్లపై హ్యుందాయ్‌ కీలక నిర్ణయం..ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గింపు

ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!