Tamil Nadu rains: కుండపోత వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో చెన్నై నగరం భారీ వర్షాలతో నీట మునిగింది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వేలాదిమంది నగర వాసులు వరదల్లో చిక్కుకున్నారు. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రవాణా పూర్తిగా స్తంభించింది. చెన్నై విమానాశ్రయం రన్‌వేపై వరద నీరు చేరడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపైకి నీరు చేరడంతో చెన్నైలో లోకల్ ట్రైన్స్‌ను రద్దు చేశారు. అన్ని ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసి అధికార యంత్రాంగం నిరంతరం సమీక్షిస్తోంది. ఈ పరిస్థితుల్లో చెన్నై నగరానికి ఎవరు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తమిళనాడులో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
ఈ మేరకు ప్రధాని మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల కేంద్రం ఆదుకుంటుందని సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోదీ హామీనిచ్చారు. ఈ సందర్భంగా వరదల పరిస్థితిపై చర్చించారు. ఈ విపత్తు నుంచి బాధిత ప్రజలంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్లో వెల్లడించారు. కాగా.. అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై వాసులు భయాందోళన చెందుతున్నారు.
Also Read: