తెలుగు గంగ ద్వారా కృష్ణా జలాల విడుదల ఆపండి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమిళ సర్కార్ లేఖ..
కృష్ణా జలాలను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలంటే తమిళనాడు సర్కార్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
Tamil Nadu letter to AP government : తమ రాష్ట్ర దాహార్తి తీర్చుతున్న కృష్ణా జలాలను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలంటే తమిళనాడు సర్కార్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. చెన్నైకి తాగునీరు అందించే రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్నందువల్ల మార్చి నెలాఖరు వరకు కృష్ణా జలాల విడుదల నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నగర శివారు ప్రాంతంలో రిజర్వాయర్లు నిండిపోయినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులపాటు నీటిని అపాలంటూ పేర్కొంది. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో ఉన్న పూండి, చోళవరం, పుళల్, కన్నన్‌కోట, చెంబరంబాక్కం రిజర్వాయర్ల నీటితో నగరవాసుల అవసరాలను ప్రజా పనులశాఖ అధికారులు తీరుస్తున్నారు.
ప్రస్తుతం పూండి రిజర్వాయర్‌లో 3,231 మిలియన్ ఘనపు టడుగులు, చోళవరంలో 881, పుళల్‌లో 3,243, కన్నన్ కోట తేర్వాయ్ కండిగ జలాశయంలో 494 , చెంబరంబాక్కంలో 3,490 మిలియన్ ఘనపుటడుగుల నీరు నిల్వవుంది. ఈ నేపథ్యంలో, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజల తాగునీటి అవసరాలను పూర్తిచేసేలా తమిళనాడు-ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కృష్ణా నది జలాల పంపిణీ పథకంపై ఒప్పందం కొనసాగుతుంది. దీని ప్రకారం.. సంవత్సరానికి 12 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తోంది.
ఈ మేరకు సంవత్సరంలో రెండు విడతలుగా కండలేరు డ్యాం నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పూండి రిజర్వాయర్‌కు తెలుగు గంగ కాలువ ద్వారా కృష్ణా జలాలు విడుదల చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి తొలివిడతగా 700 ఘనపుటడుగుల చొప్పున విడుదల చేస్తున్న నీటితో, మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయాల్లోని నీటిమట్టాలు పెరగడంతో వచ్చే వేసవి సీజన్‌లో నీటి కొరత ఏర్పడే అవకాశం లేదు. దీంతో మార్చి నెలాఖరు వరకు కృష్ణా జలాలను విడుదల అపాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది తమిళనాడు సర్కార్. నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరింది.
Read Also.. ప్రధాని మోదీ హయంలో జాతీయ రహదారులకు మహార్ధశ.. రాజ్యసభలో వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ