
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఉపందుకున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే మధురాంతకంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈసందర్భంగా డీఎంకే పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే దుష్పరిపాలన నుండి రాష్ట్రం స్వేచ్ఛ, మార్పును కోరుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడును అభివృద్ధి చెందిన, సురక్షితమైన, అవినీతి రహితంగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మధురాంతకంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. “తమిళనాడు ఇప్పుడు మార్పు కోరుకుంటోంది. డీఎంకే దుష్పరిపాలనను తమిళనాడు వదిలించుకోవాలని కోరుకుంటోంది. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, సురక్షితమైన, అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలి. డీఎంకే ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది” అని అన్నారు.
“మీరు డీఎంకేకు రెండుసార్లు మెజారిటీ ఇచ్చారు. కానీ వారు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. డీఎంకే అనేక వాగ్దానాలు చేసింది కానీ ఏమీ నెరవేర్చలేకపోయింది. ప్రజలు ఇప్పుడు డీఎంకే ప్రభుత్వాన్ని సీఎంసీ ప్రభుత్వం అని పిలుస్తున్నారు. దీని అర్థం అవినీతి, మాఫియా, నేరాలను ప్రోత్సహించే ప్రభుత్వం. డీఎంకే – సీఎంసీ రెండింటినీ గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం” అని ప్రధాని మోదీ అన్నారు.
“తమిళనాడులో ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కబంధ హస్తాల్లో నిమగ్నమై ఉంది. ఎవరైనా డీఎంకేలో ముందుకు సాగాలనుకుంటే, వారికి మూడు లేదా నాలుగు మార్గాలు ఉన్నాయి: బంధుప్రీతి, అవినీతి, నేరం. వీటి నుండి ప్రయోజనం పొందిన వారు మాత్రమే డీఎంకేలో ముందుకు సాగుతున్నారు. ఇది మొత్తం రాష్ట్రానికి హాని కలిగిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు ఎక్కడ, ఎంత అవినీతి జరుగుతుందో, ఎవరి జేబుల్లోకి ఆదాయం పోతుందో తెలుసు” అని ప్రధానమంత్రి అన్నారు.
“ఇది దేశ నాగరికతను సుసంపన్నం చేసిన భూమి. ఈ రాష్ట్రం ప్రతి రంగంలోనూ దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. నేడు, భారతదేశం అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్నందున, మనం రాష్ట్రాన్ని డీఎంకే సంకెళ్ల నుండి విడిపించాలి. రాష్ట్రం దాని నుండి ఎంత త్వరగా విముక్తి పొందితే, భారతదేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
“గత 11 సంవత్సరాలుగా, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి అపూర్వమైన కృషి చేసింది. గత ప్రభుత్వ హయాంలో, రాష్ట్రానికి చాలా తక్కువ నిధులు వచ్చాయి. గత 11 సంవత్సరాలలో, ఎన్డీఏ ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లు అందించింది, ఇది మునుపటి ప్రభుత్వం కంటే మూడు రెట్లు ఎక్కువ. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం గణనీయమైన మొత్తాన్ని కేటాయించారు” అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.
The enthusiasm at Madhuranthakam reflects a clear mood. Tamil Nadu wants freedom from DMK’s misgovernance. The NDA is the people’s preferred choice. https://t.co/8gUpScYWMk
— Narendra Modi (@narendramodi) January 23, 2026