బతుకుదెరువు కోసం.. పలువురు పలు రకాలైన పనులు చేస్తూంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. చదువుకున్నవారైతే బిజినెస్‌లు, కొన్ని రకాల జాబ్స్, లేక చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూంటారు. ఇక మరికొందరి పరిస్థితి అయితే.. అధ్వాన్నంగా ఉంటుంది. ఈ కోవలోకే మధురైలోని ఓ వ్యక్తి చేరుతాడు. ఓ వ్యక్తి ఆరునెలలుగా.. మహిళలా చీరకట్టుకుని ఇళ్లల్లో పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
మధురైలోని శివగంగై జిల్లాకి చెందిన మానామదురైలో రాజా(40) అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఇంటి పనులు చేస్తున్నాడు. ఇతను నివసించేది శివగంగై జిల్లాలో.. కానీ.. అక్కడి నుంచి రాజర్ రోడ్డు తెప్పకుళం అనే ప్రాంతానికి వెళ్లి పనిచేస్తుంటాడు. సొంత జిల్లాలో.. లుంగీ, ప్యాంటు, షర్డుతో తిరిగే ఈ వ్యక్తి.. తెప్పకుళం వెళ్లేసరికి.. ఆడ వేషంలో దర్శనమిస్తూంటాడు.
ఆ ప్రాంతంలోని.. మూడు ఇళ్లల్లో.. రాజా పనిచేస్తూంటాడు. తను ఒప్పుకున్న ఇళ్లల్లో రాజాత్తిగా పేరుమార్చుకున్నాడు. కాగా.. తాను బట్టలు మార్చుకున్నట్లు తీసిన ఫొటోలు వైరల్‌గా మారడంతో.. ఇది పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో.. రాజాను పోలీసులు విచారించారు.
అయితే.. తనకు మానామదురైలో పని దొరకలేదని.. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను పెంచుకోవడం కోసం.. ఈ అవతారం ఎత్తాల్సి వచ్చిందని అతను పేర్కొన్నాడు. నా మాట.. నడవడిక.. అంతా మహిళలా ఉండటంతో.. ఆ ఇళ్ల యజమానులకు ఎలాంటి అనుమానం రాలేదని రాజా తెలిపాడు.