బలి కోరిన వివాహేతర సంబంధం.. ప్రియురాలి కళ్లెదుటే ప్రియుడి దారుణ హత్య!

ఓ మహిళకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె భర్త మరణించడంతో.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సదరు మహిళ సోదరుడు ఆమె కళ్లెదుటే ప్రియుడిని దారుణంగా హతమార్చాడు. ఈ షాకింగ్‌ ఘటన..

బలి కోరిన వివాహేతర సంబంధం.. ప్రియురాలి కళ్లెదుటే ప్రియుడి దారుణ హత్య!
Man Murdered In Front Of His Girlfriend

Updated on: Aug 18, 2025 | 4:36 PM

మధురై, ఆగస్ట్‌ 18: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పలువురి కాపురాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భర్తలు భార్యలను హతమారుస్తుంటే.. మరికొన్ని చోట్ల భార్యలు భర్తలను గుట్టుచప్పుడుకాకుండా అంతమొందిస్తున్నారు. తాజాగా ఓ మహిళకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె భర్త మరణించడంతో.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సదరు మహిళ సోదరుడు ఆమె కళ్లెదుటే ప్రియుడిని దారుణంగా హతమార్చాడు. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులోని మదురై జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

తమిళనాడులోని మదురై జిల్లా తుంబపట్టికి చెందిన సెల్వం, రాఘవి (29) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. సెల్వం మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రాఘవి పొట్టపట్టిలోని పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మహారాజన్‌ కుమారుడు సతీష్‌ కుమార్‌ (21)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా మరో ఊరిలో కలసి ఉంటున్నారు. అయితే తమ ఇంట్లోని బంగారు నగలను కుమార్తె దొంగిలించిందని రాఘవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి రాఘవి, సతీష్‌కుమార్‌ల ఆచూకీ కనిపెట్టి బంధువులకు అప్పగించారు. దీంతో రాఘవిని ఆమె సోదరులు రాహుల్, బంధువులు ఇంట్లో బంధించారు. ప్రియుడితో పారిపోవాలని చూస్తే ఇద్దరిని చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.

దీంతో పుట్టింటి వాళ్లు తనను బంధించారని, ఎలాగైనా వచ్చి తనని తీసుకెళ్లాలని రాఘవి ప్రియుడికి ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో సతీష్‌ కుమార్‌ శనివారం రాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లి, ఆమెను తీసుకుని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాడు.పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి.. ఇద్దరూ మేజర్లని, వారిని కలిసుండమని చెప్పి పంపించారు. అదే రోజు అర్ధరాత్రి బైక్‌పై చెన్నైకు వెళ్తుండగా.. రాఘవి సోదరుడు రాహుల్‌ తన స్నేహితులతో కలిసి కారులో వారిని వెంబడించాడు. అయ్యపట్టి వద్ద బైక్‌ను కారుతో ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. అనంతరం సతీష్‌ కుమార్‌పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సతీష్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన రాఘవిని ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.