Lockdown Extension: కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఇక తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ ను జూన్ 7 వరకు పొడిగించింది. ప్రస్తుత ఆంక్షలు మే 31 వరకు అమలులో ఉంటాయి. ప్రస్తుత లాక్‌డౌన్‌కు ఎలాంటి సడలింపులు ఉండబోవని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వంలోని వైద్య నిపుణులు, సీనియర్ మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ -19 వ్యాప్తిని అంచనా వేసిన తరువాత లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
కిరాణా షాపులు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకూ ఆర్డర్లు తీసుకుని సరుకులను కస్టమర్ల ఇంటికి చేర్చేందుకు అనుతిస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అనుమతితో ఆయా ప్రాంతాలలో వాహనాల ద్వారా అవసరమైన సామాగ్రిని విక్రయించేందుకు ప్రొవిజన్ స్టోర్స్‌ను అనుమతిస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. కూరగాయలు, పండ్లు మొబైల్ వ్యాన్లలో అమ్మకాలు కొనసాగుతాయి. ప్రస్తుతం, అన్ని ఇతర షాపులను తెరవడానికి అనుమతి లేదు.
టీ షాపులకు కూడా అనుమతి లేదు. ప్రతి బియ్యం రేషన్ కార్డుదారులకు జూన్ నెల రేషన్ షాపుల ద్వారా 13 ప్రొవిజన్ సప్లయాలతో కూడిన ఫుడ్ కిట్‌ను పంపిణీ చేయాలని సహకార, వినియోగదారుల రక్షణ శాఖకు సూచించినట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో కొవిడ్ 19 లాక్‌డౌన్‌పై పొడిగింపు ఉన్నప్పటికీ, వైద్య సేవలు, ఫార్మసీలు, టీకాలపై ఎలాంటి పరిమితి ఉండదు. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని ఇతర ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది.