CM Vijay: గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు సీఎం విజయ్ బిగ్ సర్‌ప్రైజ్.. చెస్ ఆడి ఏమిచ్చారో వీడియోలో చూడండి..

నార్వే చెస్ టోర్నీలో దుమ్మురేపిన భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు సీఎం విజయ్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. అతడితో 15 నిమిషాల పాటు చెస్ ఆడారు. ఆ తర్వాత అతడి భవిష్యత్ అవసరాల కోసం ఏకంగా రూ.50లక్షల నగదు ప్రోత్సాహం అందజేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

CM Vijay: గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు సీఎం విజయ్ బిగ్ సర్‌ప్రైజ్.. చెస్ ఆడి ఏమిచ్చారో వీడియోలో చూడండి..
Praggnanandhaa Meets Tn Cm Vijay

Updated on: Jun 08, 2026 | 2:22 PM

నార్వే సెస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో దేశ కీర్తిని చాటి, స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత సెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి అపూర్వ గౌరవం దక్కింది. చెన్నైలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని ప్రజ్ఞానంద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభను అభినందిస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం తరపున రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ప్రజ్ఞానంద సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఊహించని సర్‌ప్రైజ్.. సీఎంతో 15 నిమిషాల మ్యాచ్..

సీఎం విజయ్ తనను పిలిపించి మాట్లాడటమే కాకుండా భేటీలో ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారని ప్రజ్ఞానంద ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘నేను దీన్ని అస్సలు ఊహించలేదు.. సీఎం సారే స్వయంగా చెస్ బోర్డు తెప్పించి, అక్కడి టేబుల్‌పై కాయిన్స్ సర్ది నాతో గేమ్ ఆడదామని అడిగారు. మేమిద్దరం కలిసి దాదాపు 15 నిమిషాల పాటు చెస్ ఆడాం. ఈ క్షణం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని ప్రజ్ఞానంద తెలిపాడు.

సీఎం విజయ్ చాలా బాగా ఆడుతున్నారు..

ముఖ్యమంత్రి విజయ్‌కి చెస్ ఆడటం వచ్చని తాను ఇదివరకు విన్నానని, కానీ ఆయన ఆడిన తీరు చూసి ఆశ్చర్యపోయానని ప్రజ్ఞానంద ప్రశంసించాడు. ‘‘సార్ నిజంగానే చాలా బాగా చెస్ ఆడుతున్నారు. మీరు ఎప్పుడు ఆడుతుంటారా అని నేను అడగ్గా.. తన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు ఆడుతుంటానని సార్ చెప్పారు. ఈ మ్యాచ్‌లో నేనే గెలిచినప్పటికీ.. ఆయన ఇంత ప్రతిభావంతంగా డిఫెన్స్ చేస్తూ ఆడతారని నేను అనుకోలేదు’’ అని పేర్కొన్నాడు.

కోరకపోయినా రూ. 50 లక్షల ప్రోత్సాహకం..

నార్వే టోర్నీలో తాను గెలుచుకున్న ట్రోఫీని ముఖ్యమంత్రికి చూపించానని, రాబోయే అంతర్జాతీయ పోటీల గురించి ఆయన ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని ప్రజ్ఞానంద చెప్పాడు. ఈ భేటీలో తాను ప్రభుత్వం ముందు ఎలాంటి వ్యక్తిగత లేదా క్రీడాపరమైన కోరికలు పెట్టలేదని.. అయినప్పటికీ సీఎం విజయ్ చొరవ తీసుకుని తన భవిష్యత్తు పోటీల కోసం రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించి గౌరవించారని, ఇది తనకు మరింత బూస్టింగ్ ఇస్తుందని అన్నాడు.

నార్వే టోర్నీ అనుభవాలు.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

నార్వే చెస్ టోర్నమెంట్ అనుభవాల గురించి ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. “టోర్నీ మొదటి భాగంలో నా ఆట తీరు బాగున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ కష్టపడి ఆడి ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు అందుకున్నాను” అని వివరించాడు. అలాగే తమిళనాడులో క్రీడారంగానికి, ముఖ్యంగా చెస్ క్రీడకు ఎలైట్ స్కీమ్ వంటి ప్రత్యేక పథకాల ద్వారా ప్రభుత్వం, ఎస్‌డీఏటీ అందిస్తున్న మద్దతును ప్రజ్ఞానంద ఈ సందర్భంగా కృతజ్ఞతలతో గుర్తుచేసుకున్నాడు.

Follow Us