MK Stalin: హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను ఆపండి.. ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ..

|

Oct 16, 2022 | 8:13 PM

దక్షిణాది రాష్ట్రాలు హిందీ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న వేళ మధ్యప్రదేశ్‌లో దేశంలో తొలిసారిగా హిందీలో మెడిసిన్‌ పుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం ఆవిష్కరించారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఘాటుగా స్పందించారు.

MK Stalin: హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను ఆపండి.. ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ..
Mk Stalin Pm Modi
Follow us on

దక్షిణాది రాష్ట్రాలు హిందీ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న వేళ మధ్యప్రదేశ్‌లో దేశంలో తొలిసారిగా హిందీలో మెడిసిన్‌ పుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం ఆవిష్కరించారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఘాటుగా స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దితే తిరుగుబాటు తప్పదని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ రాశారు. ఈ మేరకు ఆదివారం ఒక లేఖను ప్రధాని మోడీకి పంపించారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో ఇంగ్లీష్‌, తమిళంతో సహా 22 భాషలను పేర్కొన్న విషయాలను స్టాలిన్ లేఖలో గుర్తు చేశారు. మరిన్ని ప్రాంతీయ భాషలను ఈ జాబితాలో చేర్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయని తెలిపారు. హిందీ మాట్లాడే వారి కంటే హిందీయేతర భాషలు మాట్లాడేవారి సంఖ్య దేశంలో ఎక్కువగా ఉందన్నారు. ప్రతి భాషకు దాని ప్రత్యేకతతోపాటు భాషా సంస్కృతి కూడా ఉందని వివరించారు. ఈ క్రమంలో అన్ని మార్గాలు, మాధ్యమంల ద్వారా హిందీని బలవంతంగా విధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం స్టాలిన్‌ ఆరోపించారు.

ఇది హిందీయేతర రాష్ట్రాలలో సహేతుకమైన భయం, అసంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. ఈ చర్యలు రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. ఇలాంటి విభజన ప్రయత్నాలు హిందీయేతర రాష్ట్రాల ప్రజలను ప్రతికూల స్థితిలో ఉంచుతాయని, కేంద్రం- రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాల స్ఫూర్తిని దెబ్బతీస్తాయని వివరించారు. అందువల్ల 8వ షెడ్యూల్‌లోని అన్ని భాషలను అధికారిక భాషలుగా చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే దేశ తొలి ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీని కూడా సీఎం స్టాలిన్‌ లేఖలో గుర్తు చేశారు. ఐఐటీ, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియం ఉండాలని అమిత్‌షా కమిటీ ఇచ్చిన సిఫారసులను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మెడిసిన్‌ హిందీ మీడియం పుస్తకాలను ఆవిష్కరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా , మెడిసిన్‌ మొదటి సంవత్సరానికి చెందిన మూడు హిందీ మీడియం పుస్తకాలను ఆవిష్కరించారు అమిత్‌ షా . హిందీభాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది నిదర్శనమని అమిత్‌షా ఈ సందర్భంగా తెలిపారు. మెడిసిన్‌తో పాటు అతిత్వరలో 8 భాషల్లో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కోర్సులను కూడా ప్రవేశపెడుతామని తెలిపారు. దీంతో మెథోవలస తగ్గుతుందన్నారు. మాతృభాషలో చదువుకున్న విద్యార్ధులకు అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమిత్‌షా వివరించారు. ఇంజనీరింగ్‌ , పాలిటెక్నిక్‌ కోర్సులను కూడా 8 భాషల్లో ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.

భారత విద్యారంగంలో ఇది సువర్ణ అధ్యాయమని అన్నారు అమిత్‌ షా. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు చాలా మేలు జరుగుతుందని తెలిపారు. హిందీ ప్రాధాన్యతను అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..