
Tamil Nadu Elections 2026: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది.. కానీ అక్కడ అప్పుడే రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేసేందుకు వేసిన స్కెచ్ పనిచేయక పోవడంతో ఈ సారి నయా స్కెచ్‌తో బీజేపీ ముందుకు వెళుతోందన్న చర్చ మొదలైంది. డిఎంకేని గద్దె దించడమే లక్ష్యంగా.. అయితే నేరుగా లేదంటే ఇండైరెక్ట్‌గా కొట్టేందుకు కమలనాథులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. డీఎంకేని గద్దె దించేందుకు అవసరమైతే ప్లాన్ బీని కూడా బీజేపీ సిద్ధం చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది.
తమిళనాడులో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుంటాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా రెండున్నర ఏళ్ల తర్వాత గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ సీట్లు అనుకూలంగా కొన్ని సార్లు, ప్రతిపక్షం కూటమికి అనుకూలంగా పలు సందర్భాల్లో తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉన్నట్లు కనిపించినా.. అంచనాలను మించి అధికార డీఎంకే స్వీప్ చేసేసింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట సత్తా చాటాలని బిజెపి చేసిన రెండు ప్రయత్నాలు ఫలించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ రెండూ కలిసి పోటీ చేయగా.. రెండు పార్టీలకూ ఈ పొత్తు నష్టమే కలిగించింది. బీజేపీతో పొత్తు కారణంగానే తాము తీవ్రంగా నష్టపోయినట్లు అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు.
దీంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసి బరిలోకి వెళ్లినా ఫలితం దక్కలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా శతాధిక పార్టీలు ఉన్నాయి తమిళనాట.. ఒక్కో కూటమిలో పదికి పైగా పార్టీలు ఉండడం సర్వసాధారణం. మినిమిమ్ ఐదు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఎన్నికల బరిలో తలపడుతుంటాయి. ఎన్నికలన్నాక కూటములు.. కూటమి అన్నాక పార్టీలు ఉండడం సహజం.. అనేక ఈక్వేషన్స్ తో మరిన్ని పార్టీలతో కలిసి వెళ్ళక తప్పదు ఒక్కోసారి.. తమిళనాట ఒక్కసారి కాదు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది.
తమిళనాట పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం సెంటిమెంట్ గా ఉంటుంది. ఒకప్పుడు ద్రవిడ వాదం బలంగా ఉన్న తమిళనాట రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా తమ అవసరాల కోసం ఆ సెంటిమెంట్‌నే కొనసాగిస్తున్నాయి. దశాబ్దాల పాటు కరుణానిధి నేతృత్వంలో నడిచిన డీఎంకే, జయలలిత లీడ్ చేసిన అన్నాడిఎంకే, ఆ తర్వాత ఆ ఇద్దరు లేని ఆ పార్టీలు కూడా పొత్తులతో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగిన పరిస్థితి. రాజకీయంగా కాస్త విభిన్నమైన పరిస్థితి ఉన్న తమిళనాడులో గట్టిగా కొట్టాలనేది బిజెపిని చాలా కాలం నుంచి ఊరిస్తోంది. 2014 లో కన్యాకుమారి ఒక్క స్థానంలో గెలిచింది. అయితే 2019లో బోణి కూడా కొట్టలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. ఆతర్వాత బిజెపి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఐపీఎస్ అధికారి అన్నామలై వి.ఆర్.ఎస్ తీసుకుని పార్టీని లీడ్ చేస్తున్నారు.
ద్రవిడ వాదం బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నాయి అంటూ ద్రవిడ వాద పార్టీలపై పోరాటం, హిందూత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అన్నామలై సక్సెస్ అయ్యారన్న డిస్కషన్ జరిగినా సీట్లు మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా కొట్టాలి అనేది బిజెపి ప్లాన్.. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 10 శాతం, ఎడిఎంకె కు 20 శాతం ఓట్లు వచ్చాయి.. తాజాగా నటుడు విజయ్ స్థాపించిన టీవీకేని కలుపుకుని కూటమిగా ముందుకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది. అలాగే వన్నియార్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా కలిగిన పీఎంకెతో పాటు మరికొన్ని పార్టీలతో జాతకట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ 2021లో బిజెపి – అన్నాడీఎంకే అలయన్స్ ఫెయిల్ అవడం ఉదాహరణగా చూస్తే మాత్రం ఈసారి ఆ కలయిక మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు బిజెపి ప్లాన్ బి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. డీఎంకేకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసి తద్వారా అధికారంలోకి ఆ కూటమిని తీసుకురావాలనేది ఆలోచన.. అయితే ఆ కూటమిలో బిజెపి ఉండదు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు దూరంగా ఉండే పార్టీలతో జతకట్టి బీజేపీ బరిలో నిలిచి.. నటుడు విజయ్ టీవీకే పార్టీతో పాటు అన్నాడిఎంకేలో మూడుగా విడిపోయిన పళనిస్వామి, పన్నీరు సెల్వం, శశికళ అందరిని ఏకతాటిపైకి తెచ్చి బలమైన సామాజిక వర్గం ఓట్లు అధికంగా కలిగిన పార్టీలకు కూటముగా ఏర్పాటు చేసి డీఎంకే అధికారంలోకి రాకుండా చూడొచ్చన్న ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
తద్వారా బిజెపి నేరుగా అధికారంలోకి రాకపోయినా ఆ తర్వాత వచ్చే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అధికారంలో ఉంటే తమకు కలిసి వస్తుందన్న లోతైన వ్యూహంలో బీజేపీ ఉన్నట్టు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కూటమితో కలిసి దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న డిఎంకే.. బిజెపికి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. గతంలో కూడా జయలలిత బిజెపికి బీ టీం అన్నట్లుగా వ్యవహరించారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కాకుండా అన్నాడీఎంకే తమిళనాడులో అధికారంలోకి వస్తే పరోక్షంగా అది తమకు కలిసి వచ్చే అంశంగానే బిజెపి భావిస్తూ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.