Tamil Nadu Army Chopper Crash: నీలగిరి కొండల్లో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ ఆర్మీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే ప్రమాదంలో చనిపోయినవారిని గుర్తించడం కష్టంగా మారిందని వివరించింది. చనిపోయినవారి కుటుంబసభ్యులను ఢిల్లీ పిలిపిస్తున్నట్టు తెలిపింది. డీఎన్‌ఏ టెస్టులతో సైంటిఫిక్‌గా మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు మిలటరీ అధికారులు. కుటుంబసభ్యులతో కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. ఐడెంటిఫికేషన్ పూర్తయ్యాక వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేసింది. కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించింది.
మరోవైపు తమిళనాడులోని సులూరు ఎయిర్‌బేస్ నుంచి ఢిల్లీకి ఆర్మీ ఉన్నతాధికారుల మృతదేహాలు తరలిస్తున్నారు. నాలుగు మృతదేహాల ఆనవాళ్లు అధికారులు గుర్తించారు. జనరల్ రావత్, మధులిక, గిడ్డర్ పార్థివదేహాలను.. మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మిగిలిన 8 మంది డెడ్‌బాడీలకు DNA టెస్ట్‌లు చేయనున్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరిస్తున్నారు. డీఎన్‌ఏతో సరిపోలిన తర్వాతే.. కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తారు.
ఆప్యాయంగా, అనురాగంగా పెరిగిన అన్న సాయితేజ మృతి విషయం తెలిసిన సోదరుడు మహేశ్‌బాబు కన్నీటి పర్యంతమయ్యారు. మా అన్న లేని లోటు పూడ్చలేనిదని వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన మరణ వార్తను మొదట నమ్మలేకపోయాయని, నిజమని నమ్మడానికి చాలా సమయమే పట్టిందన్నారు. వార్త విని తట్టుకోలేనంత వేదనకు గురవుతున్నామన్నారు మహేశ్‌బాబు. తాను ఆర్మీలో చేరడానికి ఆయనే స్పూర్తి అన్నారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయని అధికారులు చెప్పగానే ఏడుపు ఆగలేదన్నారు మహేష్.
మృతదేహాలు వెల్లింగ్‌టన్ మార్చురీలోనే ఉన్నాయ్నారు. DNA పరీక్ష చేయకుండా.. ఎవరెవరో గుర్తు పట్టడం కష్టమన్నారు. మిలటరీ వైద్య బృందం మా తల్లిదండ్రులు రక్తనమూలాలు సేకరించడం కోసం ఈ రాత్రి మా స్వగ్రామానికి వస్తున్నారన్నారు. డిఎన్ఎ పరీక్ష అనంతరం రేపు మధ్యాహ్నం మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉందన్నారు.
తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి వెళ్తుండగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అందులో ఉన్న సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన వెల్లింగ్టన్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు. అయితే మృతుల్లో ఇప్పటి వరకు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరో ఇద్దరు బ్రిగేడియర్ల మృతదేహాలను మాత్రమే ఆర్మీ అధికారులు గుర్తించారు. మిగిలిన తొమ్మిది మందిని గుర్తించాల్సి ఉంది.