Ranveer Allahbadia: బూతులు మాట్లాడటానికి లైసెన్స్ ఉందా.? రణ్‌వీర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

విచాణ సందర్భంగా సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రణ్‌వీర్‌ అలహాబాదియా తరపున సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ DY చంద్రచూడ్‌ కుమారుడు అభినవ్‌ చంద్రచూడ్‌ వాదనలు వినిపించారు. అలహాబాదియా వ్యాఖ్యలు తనకు వ్యక్తిగతంగా అసహ్యకరంగా అనిపించాయనీ, నైతికంగా వీటిని సమర్థించేనని చెప్పారు.

Ranveer Allahbadia: బూతులు మాట్లాడటానికి లైసెన్స్ ఉందా.? రణ్‌వీర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
Ranveer Allahabadia

Updated on: Feb 18, 2025 | 4:15 PM

పాడ్‌‌కాస్టర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడటానికి మీకు లైసెన్స్‌ ఉందా అని సుప్రీం మండిపడింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని, “ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌” షోలో రణ్‌వీర్ చేసిన‌ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. థానేలో పాస్‌పోర్ట్ సరెండర్‌ చేయాలని రణ్‌వీర్‌ను ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ షరతు విధించింది. అలహాబాదియాను అరెస్ట్‌ చేయకుండా సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మహారాష్ట్ర, అసోం పోలీసుల దర్యాప్తునకు సహకరించినంతకాలం రణ్‌వీర్‌ అరెస్ట్‌ ఉండదని సుప్రీం వివరించింది. రణ్‌వీర్‌పై కొత్త FIRలు నమోదు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి షోలు ఇకముందు చేయకూడదని రణ్‌వీర్‌ను హెచ్చరించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, భద్రత కావాలని రణ్‌వీర్‌ కోరితే, భద్రత కోసం మహారాష్ట్ర, అసోం పోలీసులను సంప్రదించాలని ధర్మాసనం సూచించింది.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రణ్‌వీర్‌ అలహాబాదియా తరపున సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ DY చంద్రచూడ్‌ కుమారుడు అభినవ్‌ చంద్రచూడ్‌ వాదనలు వినిపించారు. అలహాబాదియా వ్యాఖ్యలు తనకు వ్యక్తిగతంగా అసహ్యకరంగా అనిపించాయనీ, నైతికంగా వీటిని సమర్థించలేనని చెప్పారు. కానీ అంతమాత్రానికే, రణ్‌వీర్‌ చేసిన వ్యాఖ్యలు శిక్షార్హమైన నేరంగా భావించాలా అన్నది మరో ప్రశ్న అని న్యాయవాది అభినవ్‌ చంద్రచూడ్‌ వాదించారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో ఇది అసభ్యత, అశ్లీలత కాకుంటే ఇంకేంటి అని జస్టిస్‌ కాంత్‌ తీవ్రంగా ఆక్షేపించారు. రణ్‌వీర్‌ తన మెదడులో ఉన్న చెడును, తన కార్యక్రమం ద్వారా వ్యాప్తి చేస్తున్నాడని జస్టిస్‌ కాంత్‌ మండిపడ్డారు.

యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అశ్లీల కంటెంట్‌ నియంత్రణకు మీరేం చేస్తారంటూ కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం తగిన చర్యలు తీసుకుంటే సంతోషమని జస్టిస్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. యూట్యూబ్‌ చానెళ్లు, యూట్యూబర్లు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నా మీరు పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ఈ అంశాన్ని మీరు వదిలేసినా మేం వదిలిపెట్టే ప్రసక్తే లేదుంటూ జస్టిస్‌ కాంత్‌ తన వైఖరిని కరాకండీగా చెప్పారు. ఈ సున్నితమైన అంశాన్ని పట్టించుకోకుండా ఉండలేమని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి జస్టిస్‌ కాంత్‌ తేల్చి చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..