న్యూఢిల్లీ, జనవరి 24: గుజరాత్‌లోని ఖేడాలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అయిదుగురిని 2022లో బహిరంగంగా కొట్టిన ఘటనపై సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై మంగళవారం (జనవరి 23) ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్ 19న గుజరాత్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇన్‌స్పెక్టర్ ఎవి పర్మార్, సబ్-ఇన్‌స్పెక్టర్ డిబి కుమావత్, హెడ్ కానిస్టేబుల్ కెఎల్ దాభి, కానిస్టేబుల్ ఆర్‌ఆర్ దాభి దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. అనుమానితులను స్తంభానికి కట్టేసి, కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలను స్తంభానికి కట్టేసి బహిరంగంగా కొట్టడం, వీడియోలు తీయడం వంటి దారుణాలను ఊపేక్షించేది లేదని మండిపడింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించే విషయంలో 1996లో ఇచ్చిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు పోలీసులకు 14 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
చట్టంపై సరైన అవగాహన ఉండాలని, ప్రతి పోలీసు అధికారి డీకే బసులో ఏ చట్టం నిర్దేశించబడిందో తెలుసుకోవాలని, న్యాయవిద్యార్థులుగా మేం డీకే బసు తీర్పు గురించి వింటున్నామని, చదువుతూనే ఉన్నామని జస్టిస్ గవాయ్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. వెళ్లి, కస్టడీని అనుభవించండి. మీరు పనిచేసే చోట మీరే అతిథులుగా ఉండండి. అక్కడ మీకు ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఉంటుందని ధర్మాసనం తీవ్రస్వరంతో పేర్కొంది. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే పదేపదే కోరడంతో 14 రోజుల జైలు శిక్షపై ధర్మాసనం మూడు నెలలపాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు నెలల కాలంలో తీర్పుపై అప్పీలు చేసుకునే అధికారం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఉంటుంది.
కాగా 2022 అక్టోబరులో జరిగిన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖేడా జిల్లాలోని ఉంధేలా గ్రామంలో ఒక గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వినందుకు 13 మంది వ్యక్తులలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది గ్రామస్తులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఐదుగురు ముస్లిం అనుమానిత నిందితులను పోలీసులు స్తంభానికి కట్టివేసి, లాఠీలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అనుమానితుల అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి, కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పేర్కొంటూ ప్రధాన ఫిర్యాదుదారు జాహిర్మియా మాలెక్‌తో సహా ఐదుగురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తొలుత 13 మంది పోలీసులను నిందితులుగా చేర్చారు. అయితే విచారణ అనంతరం వీరిలో ఐదుగురి పాత్ర కీలకమని సీజేఎం పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.