Supreme Court on ED: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఆయన సోదరుడు నామా సీతయ్యలపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకు రుణాలు మళ్లించారంటూ ఇటీవల నామా నాగేశ్వరరావు, సీతయ్యకు చెందిన ఇళ్లు, మధుకాన్ సంస్థ కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈడీ నామా నాగేశ్వరరావుకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో ఈడీ నుంచి రక్షణ కల్పించాలని నామా నాగేశ్వరరావు, సోదరుడు సీతయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వారి పిటిషన్‌ను జస్టిస్ రొహిన్టన్ ఫాలీ నారిమన్, జస్టిస్ కె.ఎం.జోసఫ్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ దాడుల నుంచి నామా సోదరులకు రక్షణ కల్పించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది పరమాత్మ సింగ్ కోరారు. ఇదే అంశానికి సంబంధించి నీలేశ్ పారేఖ్ కేసుతో ఈ పిటిషన్ జత చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు బలవంతపు చర్యలొద్దంటూ కేంద్రం, ఈడీలకు సర్వన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2011లో జార్ఖండ్‌లో రాంచీ – రార్‌గావ్ – జంషెడ్‌పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో పనులను దక్కించుకుంది. ఆ తర్వాత కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు తీసుకుంది. అనంతరం మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఇదే విషయంపై సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది. మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
Also Read: