AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో కొనసాగిన వాదనలు.. తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది.

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో కొనసాగిన వాదనలు.. తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా
Balaraju Goud
|

Updated on: Mar 02, 2021 | 6:14 PM

Share

AB Venkateswara rao suspension petition : ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. ఏడాది నుంచి సస్పెన్షన్‌ పొడిగింపుపై సర్వీస్‌ నిబంధనలు చూపించాలని జస్టిస్‌ ఎంఎం ఖన్‌విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్‌3-1సీ కింది సస్పెన్షన్‌ పొడిగించామని ధర్మాసనానికి నివేదించారు. అయితే, రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరునెలల తర్వాత పొడిగించినట్లు వెల్లడించారు.

ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి ఛార్జ్‌ లేదని.. రూల్‌3లోని 1బీ ప్రకారం ఏడాది కంటే ఎక్కువగా సస్పెన్షన్‌ ఉండటానికి వీల్లేదని ఆయన తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. అలాంటప్పుడు రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాల్‌ చేయలేదని ఏబీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేసేందుకు ఆయన మూడు రోజులు గడువు కోరగా.. న్యాయస్థానం అనుమతించింది. రివ్యూ కమిటీ ఆదేశాలపై సవాల్‌ చేసిన మూడురోజుల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.

ఇదిలావుంటే ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని, భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనపై సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా, ఏపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించింది. 2017-18 నాటి కొనుగోళ్ల వ్యవహారాన్ని అందుకు కారణంగా చూపింది. భద్రతా పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇజ్రాయెల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ కు దక్కేలా చేశాడని, ఆ సంస్థకు తన కుమారుడు చేతన్ సాయికృష్ణ భారత్ లో ప్రతినిధిగా ఉన్న విషయం దాచాడని ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడికి చెందిన ఆకాశం అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని, అందుకోసం టెండర్ల ప్రక్రియను మార్చివేశారని ఆరోపణలు వచ్చాయి.

Read Also…  Shamshabad Airport : మరో ఘనత సాధించిన శంషాబాద్ విమానాశ్రయం.. దీంతో ప్రయాణికులకు మరిన్ని సేవలు.. ఏంటో తెలుసా..