Ind vs Eng: మూడో టెస్ట్‌ రెండు రోజుల్లోనే ఎందుకు ముగిసింది? బీసీసీఐ కావాలనే స్పిన్‌ ట్రాక్‌ తయారు చేసిందా?

India vs England Test series: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఓ విస్మయం.. ఓ సంభ్రమాశ్చర్యం.. ఆ అధునాతన స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌ కూడా విచిత్రం! అవును మరి...

  • Balu
  • Publish Date - 6:01 pm, Tue, 2 March 21
Ind vs Eng: మూడో టెస్ట్‌ రెండు రోజుల్లోనే ఎందుకు ముగిసింది? బీసీసీఐ కావాలనే స్పిన్‌ ట్రాక్‌ తయారు చేసిందా?

India vs England Test series: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఓ విస్మయం.. ఓ సంభ్రమాశ్చర్యం.. ఆ అధునాతన స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌ కూడా విచిత్రం! అవును మరి… కేవలం రెండు రోజుల్లోనే ఆ మ్యాచ్‌ ముగియడం వింతే కదా! టీమిండియా సునాయసంగా పది వికెట్ల తేడాతో గెలిచింది కానీ పిచ్‌పైనే దెప్పిపొడుపులు రావడంతో విజయోత్సాహం నీరుగారిపోయింది. ఉద్దేశపూర్వకంగానే స్పిన్‌ ట్రాక్‌ను తయారు చేశారని విమర్శలు చేయడం మొదలెట్టింది ఇంగ్లీష్‌ మీడియా! ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరగనేలేదా అంటే జరిగాయి. కానీ పిచ్‌పై ఎప్పుడూ విమర్శలు రాలేదు. పరమ అధ్వాన్నంగా ఉందని, ఇంత నాసిరకమైన పిచ్‌ను ఇంతకుముందెప్పుడూ చూడలేదని కొందరు విమర్శించారు. మూడో రోజుకు వెళ్లకుండానే మ్యాచ్‌ ముగిసింది కాబట్టి సహజంగానే ఇలాంటి విమర్శలు వస్తాయి.

టెస్ట్‌ మ్యాచ్‌లకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మొన్నటి మ్యాచ్‌ను కూడా లెక్కేస్తే ఇప్పటి వరకు 2,412 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కేవలం 22 మ్యాచ్‌లు మాత్రమే రెండు రోజుల్లో ముగిశాయి. రెండు రోజులు, అంతకంటే తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌లు కేవలం ఒకశాతం మాత్రమే అన్నమాట! ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే కొత్త మిలినియంలో, అంటే 2000 సంవత్సరం తర్వాత రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌లు ఏడున్నాయి. 1877 నుంచి 1896 వరకు జరిగిన 49 టెస్ట్‌ మ్యాచ్‌లలో ఇలాంటి సంఘటనలు తొమ్మిది జరిగాయి. తర్వాతి 50 ఏళ్లలో అంటే 1896 నుంచి 1946 వరకు 226 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి.. ఇందులో ఆరు టెస్ట్‌ మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిశాయి. అయితే అప్పట్లో ఇన్ని విమర్శలు రాలేదు.. రెండు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిందంటే అది బౌలర్ల గొప్పేనని చెప్పుకొచ్చారు.. పిచ్‌ బాగోలేదని ఎవరూ అనలేదు.. అసహజమని ఎవరూ భావించలేదు. అప్పట్లో టెస్ట్ క్రికెట్‌ను ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు మాత్రమే ఆడేవి.. తర్వాతే టెస్ట్‌ దేశాలు పెరిగాయి. ఇంకో విషయమేమిటంటే అప్పుడు టెస్ట్ మ్యాచ్‌లకు కాలపరిమితి ఉండేది కాదు.. ఫలితం వచ్చే వరకు రెండు జట్లు ఆడాల్సిందే! ఏడు రోజులు పట్టొచ్చు.. ఎనిమిది రోజులు పట్టొచ్చు.. కొన్ని సందర్భాలలో పది రోజులు కూడా పట్టొచ్చు. అందుకే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం పిచ్‌పై నిందలేస్తున్నారు. స్పిన్‌ ట్రాక్‌ తయారు చేస్తారా అంటూ ఈసడించుకుంటున్నారు. మూడో దశకం తర్వాత ఇండియా, వెస్టిండీస్‌, న్యూజీలాండ్‌ దేశాలు టెస్ట్‌ హోదా సంపాదించాయి. ఆ తర్వాత టెస్ట్‌ మ్యాచ్‌కు అయిదు రోజుల కాలపరిమితి విధించారు. 20వ శతాబ్దపు రెండో అర్థభాగంలో రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ అస్సలు లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆట నెమ్మదిగా బ్యాట్స్‌మెన్‌ ఫేవర్‌లోకి మారడమే ఇందుకు కారణం. దాంతో పాటుగా పిచ్‌ను పదిలంగా చూసుకోవడం మొదలయ్యింది. సాయంత్రాలు పిచ్‌ను కవర్‌ చేయడం, వర్షం నుంచి కాపాడుకోవడం, ప్రతీ సెషన్‌లో రోల్‌ చేయడం వంటివి చేస్తున్నారు కాబట్టి పిచ్‌ డ్యామేజ్‌ అవ్వడం లేదు.India vs England 3rd test,whether the pitch was fit to host a game in the longest format,India vs England,pitch was fit to host a game,a game in the longest format,ఏడో దశకానికి వచ్చేసరికి క్రికెట్ అభిమానులు టెస్ట్ మ్యాచ్‌ల పట్ల నిరాసక్తి కనబర్చసాగారు. అయిదు రోజులు సాగినా ఫలితం వచ్చేది కాదు.. పిచ్‌లు కొద్దిగా బౌలర్లకు అనుకూలంగా రూపొందించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా భారత ఉపఖండంలోని పిచ్‌లయితే స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించేట్టుగా తయారు చేయసాగరు క్యూరేటర్లు. అయినా మ్యాచ్‌లు నిస్సారమైన డ్రాలుగా ముగిసేవి. ఇలా ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించేట్టుగా ఉండటం విమర్శలకు దారి తీసింది. నిజానికి పిచ్‌ బిహేవియర్‌ స్థిరంగా ఉండాలి. మనకు అనుకూలించేట్టుగా మార్చకూడదు. అదే సమయంలో వన్డేలకు ఆదరణ పెరగడం మొదలు పెట్టింది. ఓ రోజులో మ్యాచ్‌ అటో ఇటో తేలిపోతుండటంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆ గేమ్‌వైపు షిఫ్టవ్వసాగారు.. టెస్ట్ మ్యాచ్‌లకు కొన్ని సార్లు ప్రేక్షకులు కూడా కరువయ్యేవారు. అసలు క్రికెట్‌ అంటేనే టెస్ట్‌ మ్యాచ్‌.. అందులోనే క్రికెటర్ల సత్తా ఏమిటో తెలుస్తుంది.. ఆటగాళ్ల టెక్నిక్‌ బయటపడేది టెస్ట్ మ్యాచ్‌ల్లోనే! అలాంటి టెస్ట్‌లకు ఆదరణ తగ్గుతుండటం చూసి ఐసీసీ అలెర్టయ్యింది.. టెస్ట్ మ్యాచ్‌లకు మునుపటి వైభవం తేవడానికి ఏం చేయాలో ఆలోచించింది. అయిదు రోజుల్లో 40 వికెట్లు పడితే తప్ప ఫలితం రాదు.. ఒక్కోసారి విజయం సాధించే జట్టు తక్కువ వికెట్లు కోల్పోవచ్చు.. విజయం సాధించే జట్టు మాత్రం ప్రత్యర్థులను రెండుసార్లు ఆలౌట్‌ చేయాల్సి ఉంటుంది.. ఇందుకు స్పోర్టింగ్‌ వికెట్లు అవసరమని భావించిన ఐసీసీ ఆ దిశగా అడుగులు వేసింది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌లను తయారు చేయసాగింది.. ఇదే సమయంలో బ్యాట్స్‌మెన్‌ కూడా తన టెక్నిక్‌ మర్చుకోవలసి వచ్చింది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై పాతుకపోవడం బ్యాట్స్‌మెన్‌కు అగ్ని పరీక్షే! అందుకే టెక్నిక్‌ను ఇంప్రూవ్‌ చేసుకున్నారు. ఫుట్‌వర్క్‌ ఇంపార్టెన్స్‌ను తెలుసుకున్నారు. గత పదేళ్ల నుంచి జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లను పరిశీలిస్తే బౌలర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది.. టెస్ట్‌ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో క్రమేపీ వాటికి ఆదరణ పెరగసాగింది.India vs England 3rd test,whether the pitch was fit to host a game in the longest format,India vs England,pitch was fit to host a game,a game in the longest format,ఈ మిలీనియంలో జరిగిన మ్యాచ్‌లలో ఏడు మ్యాచ్‌లు రెండు రోజులు, అంతకంటే తక్కువ సమయంలోనే ముగిశాయని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ఆ ఏడింటిలోని మూడు మ్యాచ్‌లలో జింబాబ్వే ప్రాతినిధ్యం వుంది.. అప్ఘనిస్తాన్‌ ఆడిన ఓ మ్యాచ్‌ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. జింబాబ్వే క్రికెట్ గురించి తెలిసిందే కదా! పాపం ప్లేయర్లను బోర్డు పట్టించుకోవడం లేదు.. ఆ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యింది కూడా! ఇంతకు ముందులా జింబాబ్వే టీమ్‌ బలంగా ఏమీ లేదు.. చాలా బలహీనపడింది. ఆ దేశ పాలకులకు కూడా క్రికెట్‌ను కాపాడుకోవాలనే ఆసక్తి కొరవడింది.. ఇక అప్ఘనిస్తాన్‌ విషయానికి వస్తే ఇటీవలి కాలంలోనే ఆ దేశం టెస్ట్‌ హోదాను సంపాదించింది. వన్డేలంటే ఎలాగో అలాగా నెట్టుకు రాగలదు కానీ. అయిదు రోజుల ఆటపై ఆ దేశానికి అంతగా పట్టులేదు.. అనుభవమూ లేదు. ఇక 2002లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ మధ్య యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జాలో జరిగిన మ్యాచ్‌ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. అక్టోబర్‌ 11న మొదలైన మ్యాచ్‌ 12న ముగిసింది. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 59 పరుగులకే కుప్పకూలింది. అబ్దుర్‌ రజాక్‌ 21పరుగులు చేశాడు. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మాథ్యు హేడెన్‌ సెంచరీ కారణంగా 310 పరుగులు చేయగలిగింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ మరింత అధ్వాన్నంగా ఆడి 53 పరుగులకు చాప చుట్టేసింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న షేన్‌వార్న్‌ రెండో ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్లు సాధించాడు. 2000 సంవత్సరంలో ఇంగ్లాండ్‌- వెస్టిండీస్‌ మధ్య లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌ కూడా రెండు రోజుల్లో ముగిసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 172 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసింది. వంద పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండీస్‌ 61 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ పిచ్‌ కంప్లీట్‌గా పేస్‌ బౌలర్లకు అనుకూలించింది. చలిగాలులు, మబ్బులు పట్టిన ఆకాశం కూడా పేస్‌ బౌలర్లకు కలిసివచ్చాయి. బాల్‌ ఊహించిన దానికంటే ఎక్కువగానే స్వింగయ్యింది. ఈ మ్యాచ్‌ కచ్చితంగా లో స్కోరింగ్‌ మ్యాచే! అయితే వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత నాటకీయంగా 26.2 ఓవర్లలోకే ఆలౌట్‌ అవ్వడం ఆశ్చర్యమే! ఈ మ్యాచ్‌లో కేవలం మూడే హాఫ్‌ సెంచరీలున్నాయి.. ఇంగ్లాండ్‌ తరఫున మైకెల్‌ వా, గ్రేమ్‌ హిక్‌లు అర్థసెంచరీలు చేస్తే వెస్టిండీస్‌ ప్లేయర్‌ రామ్‌నరేశ్‌ శర్వాన్‌ హాఫ్‌ సెంచరీ చేశారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ మూడెంకల స్కోరు సాధించలేని వెస్టిండీస్‌ పిచ్‌పై ఎలాంటి అభాండాలు వేయలేదు.. పిచ్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. బ్యాట్స్‌మెన్‌ రాణించకపోవడం వల్లే గౌరవప్రదమైన స్కోరు సాధించలేకపోయామంటూ హుందాగా చెప్పింది.India vs England 3rd test,whether the pitch was fit to host a game in the longest format,India vs England,pitch was fit to host a game,a game in the longest format,అయితే అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసే సరికి ఇంగ్లీష్‌ మీడియా నానా రాద్ధాంతం చేసింది. ఏ జట్టూ కనీసం 150 పరుగులు చేయలేకపోయింది. రెండు జట్లు కలిపి రెండే హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇంత సంక్లిష్టమైన పిచ్‌పై కూడా రోహిత్‌శర్మ, జాక్‌ క్రాలేలు అర్థ సెంచరీలు చేయగలిగారు. ఆట ఆరంభం నుంచే బంతి అనూహ్యంగా తిరగడం మొదలు పెట్టింది. అక్సర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జానీ బైర్‌స్టో అవుటైన తీరే ఇందుకు నిదర్శనం. అప్పుడప్పుడు బౌలింగ్‌ చేసి ముచ్చట తీర్చుకునే జో రూట్‌ తన ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడంటే పిచ్‌ స్పిన్‌కు ఎంతగా సహకరించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఎనిమిది పరుగులిచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు రూట్‌! ఈ మ్యాచ్‌లో పడిన 30 వికెట్లలో 28 వికెట్లు స్పిన్‌ బౌలర్లు తీసినవే కావడం గమనార్హం. నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఇంగ్లాండ్‌ బరిలో దిగడమే పెద్ద మిస్టేక్‌ అని ఇప్పుడు చాలా మంది వాదిస్తున్నారు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారని కూడా అంటున్నారు. అయితే పిచ్‌ను ఉద్దేశపూర్వంగానే భారత స్పిన్నర్లకు అనుకూలించేట్టుగా తయారు చేశారన్నది మాత్రం కాదనలేని నిజం! కొద్ది రోజుల ముందే ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించిన టీమిండియాకు నిజంగానే పిచ్‌ను ఇలా తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకలా చేసి ఉంటుంది? ఇక్కడే బోల్డన్ని సందేహాలు వస్తున్నాయి.
చెన్నైలో జరిగిన తొలి టెస్ట్‌లో పరాజయం ఇండియన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మనసు మార్చేసిందా? పూర్తిగా స్పిన్నింగ్‌ ట్రాక్‌ తయారుచేయాల్సిందిగా క్యూరేటర్‌కు ఆదేశాలు వెళ్లాయా? అధునానత స్టేడియం, పైగా నరేంద్రమోదీ పేరుతో వెలిసిన స్టేడియం. ఇందులో జరిగే తొలి మ్యాచ్‌లోనే భారత్‌ ఓటమి చెందితే బాగుండదు కాబట్టే అహ్మదాబాద్ గ్రౌండ్‌ అధికారులు పిచ్‌ను స్పిన్‌ట్రాక్‌గా మార్చారా? క్యూరేటర్లకు టీమ్‌ ఇండియా ప్రతిభపై నమ్మకం లేదా? తమ దేశ పర్యటనకు వచ్చిన టీమిండియాను ఓడించడానికి ఆస్ట్రేలియా టాలెంట్‌నే నమ్ముకుంది. స్పోర్టింగ్‌ వికెట్లనే రూపొందించింది. తమకు అనుకూలంగా పిచ్‌లను మార్చుకోలేదే? ఈ ప్రశ్నలకు సమాధానాలు అనవసరం కానీ ఎవరికి వారు పిచ్‌లను తమకు అనుకూలంగా మార్చేసుకుంటూ వెళితే అంతిమంగా నష్టపోయేది క్రికెటే! భారత క్రికెట్ అభిమానులకు ప్రతీసారి తమదేశమే విజయం సాధించాలనే కోరిక గట్టిగా ఉంటుంది.. ప్రత్యర్థుల విజయాన్ని ఓ పట్టాన జీర్ణించుకోలేరు. అయితే ప్రత్యర్థుల టాలెంట్‌ను కూడా గుర్తించగలగాలి.. ప్రస్తుతం టీమిండియా మిగతా అన్ని క్రికెట్ దేశాల కంటే బలంగా ఉంది.. ఎవరినైనా ఓడించగల శక్తి సామర్థ్యాలు టీమిండియాకు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులోనైనా, ఎలాంటి పిచ్‌పైనైనా ఆడగలగే దమ్ము ఉంది.. ఇండియన్‌ క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇది తెలుసుకోవాలి. అహ్మదాబాద్‌ స్టేడియంలో రూపొందించిన పిచ్‌ నాసిరకమైనదనే వాస్తవాన్ని అంగీకరించాలి. చివరి టెస్ట్‌ కోసమైనా క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ నాణ్యమైన పిచ్‌ను రూపొందించాలి. అప్పుడే ఉత్తమమైన క్రికెట్‌ను వీక్షించగలుగుతాం! భారత క్రికెట్ కంట్రోల్‌ బోర్డు పెద్దలు తెలుసుకుంటున్నారా?

మరిన్ని చదవండి ఇక్కడ :

మహిళల పాలిటి శబరిమల ఆట్టుక్కాల్‌ భగవతి క్షేత్రం! వైభవంగా జరుగుతున్న ఆట్టుక్కాల్‌ పొంగల వేడుక!

ప్రజలు ప్రశ్నించడాన్ని మరిచిపోయారా..పాలకులు పట్టించుకోవడం మానేశారా..