Pegasus in Supreme Court: పెగాసస్ స్పైవేర్ వ్యవహరంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..

Pegasus in Supreme Court: పెగాసస్ స్పైవేర్ వ్యవహరంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..
Supreme Court

పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 10రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.

Balaraju Goud

|

Aug 17, 2021 | 1:25 PM

Supreme Court Hearing on Pegasus: పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 10రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. అయితే, ప్రతి దేశం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు ఎస్జీ. నిన్ననే అఫిడవిట్‌ దాఖలు చేశామని.. ఇక, కొత్తగా చెప్పడానికి ఏమీ లేదని ప్రభుత్వం తరుఫున ఎస్జీ పేర్కొన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని.. వివరాలను బహిరంగపరచలేమని వెల్లడించారు. అయితే, విచారణ పూర్తి స్థాయిలో చేపట్టడానికి నోటీసులిస్తున్నట్లు పేర్కొన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

ఇదిలావుంటే, సోమవారం పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దాచేయడానికి ఏం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్రం ప్రభుత్వం క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేసింది.. అయితే, సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మసనం పేర్కొంది. దీనిపై ఇవాళ మరోసారి విచారణ కొనసాగింది.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా దుమారం లేపిన పెగాసస్‌పై కేంద్రం సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పెగసస్​తో ప్రముఖల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలన్నీ తప్పని సుప్రీంకోర్టుకు తెలిపింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం రెండు పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై నిపుణుల కమిటీ వేస్తామని..ఈ అంశాన్ని ఆ ప్యానెల్‌ పరిశీలిస్తుందని కోర్టుకు తెలిపింది. రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై ప్రభుత్వం నిఘా ఉంచిందని పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలు కేవలం కల్పితమేనని..ఇందుకు ఆధారాలు లేవని పేర్కొంది.

పెగాసస్​పై సుప్రీంకోర్టు పెగసస్ ఆరోపణలపై ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే స్పష్టం చేశారని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. పెగాసస్‌ అంశంలో అన్ని అంశాలను నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని చెప్పింది. ఇక, పెగాసస్ చాలా సున్నితమైన అంశమని కోర్టుకు తెలిపారు ఎస్జీ తుషార్ మెహతా. ఈ వ్యవహారాన్ని సెన్సేషనల్‌ చేయాలని చూస్తున్నారని.. దీంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని కోర్టుకు విన్నవించారు. ఐతే పెగాసస్‌పై కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌తో సంతృప్తి చెందని సీజేఐ..పూర్తి వివరాలతో అఫిడవిట్‌ సమర్పించాలని సూచించారు.

పెగాస‌స్ స్పైవేర్ ద్వారా భార‌త్‌లో ఇద్దరు మంత్రులు, 40 మందికి పైగా జ‌ర్నలిస్టులు, ముగ్గురు విప‌క్ష నేత‌లు, ఓ సిట్టింగ్ న్యాయ‌మూర్తి స‌హా ప‌లువురు వ్యాపార‌వేత్తలు, సామాజిక కార్యక‌ర్తల‌తో కూడిన 300 మందికి పైగా వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ కోసం టార్గెట్ చేశార‌ని అంత‌ర్జాతీయ మీడియా క‌న్సార్షియం ఇటీవ‌ల వెలుగులోకి తేవ‌డం క‌ల‌కలం రేపింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ పెగాసస్‌పై గందరగోళం నెలకొంది. పెగాసిస్‌ వ్యవహారంతో పార్లమెంటు వర్షకాల సమావేశాలు దద్దరిల్లిపోయాయి. విపక్షాల నిరసనలతో అట్టుడికిపోయాయి. మరోవైపు పెగసిస్‌పై కేంద్రం తీరుగా వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలకు దిగాయి. రాహుల్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హస్తం శ్రేణులు హస్తినలో భారీ ర్యాలీ నిర్వహించారు. నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేశారని..ఈ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. పెగసిస్ స్పైవేర్‌తో మన ఫోన్లను హ్యాక్‌ చేశారని ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు.

Read Also…  SBI: ఎస్‌బీఐ పండగ ఆఫర్లు.. రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు.. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తుకు అదనపు రాయితీలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu