Supreme Court: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా తెలుగు వ్యక్తి..! ఇంతకీ సుప్రీం చీఫ్‌ని ఎలా నియమిస్తారో తెలుసా?

|

Mar 24, 2021 | 4:00 PM

చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. బోబ్డే సిఫారసు చేసిన దరిమిలా వచ్చే నెల (ఏప్రిల్) ఆఖరులోగా రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ ఎంపిక ఎలా జరుగుతుంది?

Supreme Court: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా తెలుగు వ్యక్తి..! ఇంతకీ సుప్రీం చీఫ్‌ని ఎలా నియమిస్తారో తెలుసా?
Follow us on

Supreme Court Chief Justice selection process: దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, జస్టిస్ ఎన్.వీ.రమణగా నియమితులు కాబోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిగా వున్న రమణను తన పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. బోబ్డే సిఫారసు చేసిన దరిమిలా వచ్చే నెల (ఏప్రిల్) ఆఖరులోగా రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ ఎంపిక ఎలా జరుగుతుంది? ఈ అంశంపై ఇపుడు అందరు ఆసక్తి చూపిస్తున్నారు.

సుప్రీంకోర్టుకు ఇప్పటివరకు 47 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. ఇప్పుడున్న శరద్ అరవింద్ బోబ్డే సుప్రీంకోర్టుకు 47వ ప్రధాన న్యాయమూర్తి. ఏప్రిల్ 23వ తేదీన బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు. దాంతో సుప్రీంకోర్టుకు సారథ్యం వహించే కొత్త చీఫ్ జస్టిస్ ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ బోబ్డే.. జస్టిస్ రమణను తన వారసునిగా సిఫారసు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా కానున్న రెండో తెలుగు వ్యక్తిగా రమణ నిలుస్తున్నారు. ఇంతకు మందు 1966లో చీఫ్‌ జస్టిస్‌గా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, తర్వాత ఉమ్మడి ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు కోకా సుబ్బారావు.

1902లో రాజమహేంద్రవరంలో జన్మించిన కోకా సుబ్బారావు.. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మద్రాస్ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆనాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ నియమకం మేరకు 1966 జూన్ 30వ తేదీ నుంచి 1967 ఏప్రిల్ 11వ తేదీ వరకు జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా వ్యవహరించారు. 1976లో ఆయన మరణించారు. కాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌గా బాధ్యతలను నిర్వహించిన వారిలో మహారాష్ట్రకు చెందిన వారే అధికంగా వున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది మహారాష్ట్రీయల్లు సుప్రీం చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. ఇప్పుడున్న సీజేఐ బాబ్డే కూడా మహారాష్ట్రకు చెందినవారే. తరువాతి స్థానంలో ఉత్తర ప్రదేశ్‌ వుంది. యుపీ నుంచి ఇప్పటి వరకు ఆరుగురు సుప్రీం సీజేఐగా వ్యవహరించారు.

ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియ

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఎంపికకు కొలిజియం వ్యవస్థ వుంది. ప్రధాన న్యాయమూర్తి ఎంపిక మాత్రం ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ సిఫారసు ద్వారానే జరుగుతుంది. దీనికోసం సిఫారసు చేయవలసిందిగా ముందుగా కేంద్ర న్యాయ శాఖ నుంచి సీజేఐకు లేఖ పంపుతారు. ఇప్పటికే బోబ్డేకు లేఖ పంపారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌. చీఫ్ జస్టిస్ ప్రతిపాదనను న్యాయశాఖ పరిశీలించి, ప్రధాన మంత్రి ఆమోదానికి పంపుతారు. ప్రధానమంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్‌ న్యాయమూర్తి చీఫ్‌ జస్టిస్‌గా ఎంపికైనట్లే. ప్రధాన మంత్రి ఆమోదంతో ఫైలు రాష్ట్రపతి భవన్‌కు చేరుతుంది. పీఎం సూచన మేరకు రాష్ట్రపతి సీజేఐ నియమకాన్ని ఓకే చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. సీనియర్‌ మోస్ట్‌ జడ్జి యోగ్యతలపై సందేహాలుంటే, ఇతర న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయిస్తారు. ఏదేమైనా తదుపరి చీఫ్‌ జస్టిస్‌ పేరును సిఫారసు చేయాల్సిన బాధ్యత సిట్టింగ్ చీఫ్‌ జస్టిస్‌కే వుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. ఆయన పదవీ కాలం 2022 ఆగస్టు 26వ తేదీ వరకు ఉంది. ఎన్‌వీ రమణ సీజేఐగా ఎంపికైతే దేశ ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన రెండవ తెలుగు వ్యక్తి అవుతారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27వ తేదీన జన్మించారు ఎన్.వీ. రమణ. జస్టిస్ ఎన్.వీ. రమణగా అందరికీ సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన వ్యవహరించారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఇంఛార్జిగా పని చేశారు. కాగా 2020 ఆగస్టులో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబీకులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. అమరావతి భూముల వ్యవహారంలో జస్టిస్ రమణ కుటుంబీకుల జోక్యం వుందన్నది ఏపీ సీఎం రాసిన లేఖల సారంశం. ఈ విషయంలో విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగులో వుండింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే జస్టిస్ రమణ పేరును తదుపరి చీఫ్ జస్టిస్ పోస్టుకు నామినేట్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సీజేఐ కార్యాలయం బుధవారం నాడే ప్రకటన విడుదల చేసింది.

ALSO READ: రసవత్తరంగా తిరుపతి ఉప ఎన్నిక.. ఉద్ధండులను దింపిన వైసీపీ, టీడీపీ.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ?