WITT 2025: ఔరంగజేబు ఆక్రమణదారుడే! టీవీ9 సమ్మిట్‌లో RSS నేత సునీల్ అంబేకర్
బాలీవుడ్ చిత్రం 'చావా' తర్వాత ఔరంగజేబుపై జరుగుతున్న వివాదంపై ఆర్‌ఎస్‌ఎస్ నేత సునీల్ అంబేకర్ స్పందించారు. ఔరంగజేబును ఆక్రమణదారుడిగా అభివర్ణించిన ఆయన, ఆక్రమణదారులను కీర్తించడం సరికాదని అన్నారు. ప్రస్తుత చర్చను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని, దేశభక్తులైన ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్ ల గురించి చర్చించాలని సూచించారు. నాగ్‌పూర్ హింసను ఆయన తప్పుబట్టారు.

మొఘల్ పాలకుడు ఔరంగజేబు వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన సునీల్ అంబేకర్ స్పందించారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో సునీల్ అంబేకర్ పాల్గొని మాట్లాడారు. ఔరంగజేబును ఆక్రమణదారుడిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలోని ఏ ఆక్రమణదారుడినీ ప్రశంసించడం, ఎవరైనా దొంగ భారతదేశానికి వచ్చి, దోచుకుని, పారిపోతే, అతన్ని కీర్తించడం సరికాదని అంబేకర్ అన్నారు. ఇది సమాజంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఔరంగజేబు గురించి..
ప్రస్తుతం ఔరంగజేబుపై చర్చ తప్పు అని సునీల్ అంబేకర్ అన్నారు. ఇటువంటి అంశాలను ఉద్దేశపూర్వకంగా లేవనెత్తుతున్నారంటూ వెల్లడించారు. ఇది అస్సలు టాపిక్ కాదు. ఆక్రమణదారుల గురించి మాట్లాడి ఉద్దేశపూర్వకంగా ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారంటూ పేర్కొన్నారు. ప్రజలు ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్ గురించి మాట్లాడాలని అన్నారు. ఈ వ్యక్తులు దేశభక్తులు. ఔరంగజేబు సమాధి తవ్వకంపై స్పందిస్తూ.. అది రాజ్యాంగ పరిమితుల్లో ఉంటేనే సరైనదని అంబేకర్ అంటున్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హింసను సునీల్ అంబేకర్ తప్పుబట్టారు. హింసను ఏ విధంగానూ సమర్థించలేమన్నారు. నాగ్‌పూర్ హింసపై పోలీసులు, చట్టం తమ పని తాము చేసుకుంటున్నాయని అంబేకర్ అన్నారు.
చావా తర్వాత..
బాలీవుడ్ సినిమా చావా విడుదలైనప్పటి నుండి ఔరంగజేబుపై చర్చ మొదలైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఈ అంశానికి సంబంధించి ఎక్కువ వివాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ ఔరంగజేబుకు మద్దతుగా మాట్లాడిన తర్వాత వివాదం మరింత పెరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.