పట్టుదల ఉంటే పరిస్థితులకు ఎదురీదుతూ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అనేక మంది మహిళలు నిరూపిస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లోనే కాదు.. దేశ భద్రతలో తాము మగవారికంటే ఏ మాత్రం తక్కువ కాదని సత్తా చాటుతున్నారు.. ఆర్మీ, నావీ, వైమానిక రంగాల్లో తమ ప్రతిభతో అడుగు పెడుతున్నారు. గగన విహారం చేయడమే కాదు.. యుద్ధ విమానాలు నడపగలం అంటున్నారు.. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఓ ముస్లిం బాలిక. తాజాగా ఉత్తర్ ప్రదేశ్, మీర్జాపూర్ లోని జసోవర్ కి చెందిన టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా ఎంపికైంది. అంతేకాదు దేశంలోని మొదటి ముస్లిం బాలికగా మాత్రమే కాదు.. ఆ రాష్ట్రంలో మొదటి ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించింది.
సానియా మీర్జా మీర్జాపూర్ దేహత్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జసోవర్ గ్రామ నివాసి. NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. 149 వ ర్యాంక్ తో సానియా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో సానియా తన జిల్లాకే కాదు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. హిందీ మీడియం విద్యార్థులు కూడా దృఢ సంకల్పంతో చదివితే విజయం సాధిస్తారని తెలిపింది. ఈ నెల 27న పుణెలోని ఎన్డీయే ఖడక్వాస్లా అకాడమీలో చేరనుంది. సానియా సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా గర్వపడుతున్నారు.
సానియా తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ.. తన కూతురుకి దేశంలోని మొదటి మహిళా ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేదిని రోల్ మోడల్ అని చెప్పారు. మొదటి నుండి.. అవనీ లాగే ఉండాలని కోరుకునేదని తెలిపారు. ఇప్పుడు దేశంలో ఫైటర్ పైలట్‌గా ఎంపికైన రెండో అమ్మాయి సానియా.
ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి 10వ తరగతి వరకు గ్రామంలో ఉన్న పండిట్ చింతామణి దూబే ఇంటర్ కళాశాలలో చదివింది. అనంతరం నగరంలోని గురునానక్ బాలికల ఇంటర్ చదివింది. అప్పుడు ఆమె 12వ యుపి బోర్డులో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆమె సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీలో నుంచి కోచింగ్ తీసుకుని తన లక్ష్యాన్ని సాధించడానికి సన్నాహాలను ప్రారంభించింది. తాను ఈ రోజు భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా ఎంపిక కావడానికి కారణం తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు.. సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీ కూడా ముఖ్య పాత్ర పోషించిందని తన విజయానికి క్రెడిట్ ఇస్తుంది.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో ఫైటర్ పైలట్‌లో మహిళలకు కేవలం రెండు సీట్లు మాత్రమే రిజర్వ్ చేయబడినట్లు సానియా చెప్పింది. తాను మొదటి ప్రయత్నంలో సీటు సాధించలేకపోయాను.. రెండవ ప్రయత్నంలో సక్సెస్ అందుకున్నట్లు పేర్కొంది.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022లో పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 400 సీట్లు ఇందులో ఉన్నాయి. మహిళలకు 19 సీట్లు ఉండగా, ఫైటర్ పైలట్‌లకు రెండు సీట్లు రిజర్వు చేయబడ్డాయి. ఈ రెండు సీట్లలో ఒకటి సానియా తన ప్రతిభతో సొంతం చేసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..