Watch: గాల్లో విమానం.. రన్‌ వేపై ఊడిన టైర్.. పైలట్లు ఏం చేశారంటే..? వీడియో వైరల్..

విమాన ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. తాజాగా స్పెస్ జెట్ ఫ్లైట్ పెను ప్రమాదం నుంచి బయటపడింది. విమానం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే దాన్ని టైర్ ఊడిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. పైలట్లు చివరకు ఏం చేశారంటే..?

Watch: గాల్లో విమానం.. రన్‌ వేపై ఊడిన టైర్.. పైలట్లు ఏం చేశారంటే..? వీడియో వైరల్..
Spicejet Flight Wheel Falls Off

Updated on: Sep 12, 2025 | 7:33 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంత విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి విమాన ప్రయాణం అంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రమాదంలో 250 మంది మరణించారు. ఆ తర్వాత కూడా పలు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నా.. ఆ స్థాయిలో ప్రాణాలు పోలేదు. ఏకంగా విమాన భద్రతపైనే ఆందోళనలు రేకెత్తిస్తుంది. తాజాగా ఓ విమానం టైర్ ఊడిపోవడం భయాందోళనకు గురిచేసింది. కానీ చివరకు అది సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబైకి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని టైర్లలో ఒకటి ఊడి రన్‌వేపై పడిపోయింది. అయితే ఈ విషయాన్ని గమనించినప్పటికీ పైలట్లు తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

ఏం జరిగిందంటే..?

స్పైస్‌జెట్ క్యూ400 విమానం టేకాఫ్ అయిన తర్వాత రన్‌వేపై ఒక టైర్ పడిపోయినట్లు కాండ్లా ఎయిర్‌పోర్ట్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అయితే అప్పటికే విమానం గాల్లో ఉంది. దీంతో పైలట్లు తమ ప్రయాణాన్ని అలాగే కొనసాగించారు. చివరకు ఫ్లైట్ ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ముంబైలో సేఫ్‌గా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై స్పైస్‌జెట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సెప్టెంబర్ 12న కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం Q400కు చెందిన టైర్ టేకాఫ్ తర్వాత రన్‌వేపై కనిపించింది. అయినప్పటికీ విమానం ముంబైకి తన ప్రయాణాన్ని సాగించి..సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ తర్వాత విమానం అలాగే టెర్మినల్‌కు చేరుకుంది. ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా దిగారు’’ అని తెలిపారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని తెలిపింది.