Azam Khan in critical condition : ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆజంఖాన్ ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారని లక్నోలోని మేదాంత ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. మే 9వ తేదీన ఆజంఖాన్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో సీతాపూర్ జైల్లో ఉన్న ఆయనకు జైల్లోనే చికిత్స అందించారు. అయితే, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయనను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆజంఖాన్ తో పాటు అదే జైలులో వున్న ఆయన కుమారుడు అబ్దుల్లా ఖాన్ కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం తండ్రీకొడుకులిద్దరూ మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల మీద ఆజంఖాన్ పై 100కు పైగా కేసులు ఉన్నాయి. అటు, ఆజంఖాన్ తనయుడు కూడా అనేక నేరాళ్లో నిందితుడు. ఇక, మొన్నటివరకూ ఫోర్జరీ కేసుకు సంబంధించి సీతాపూర్ జైలులో ఉన్న ఆజం ఖాన్ భార్య ఎస్పీ ఎమ్మెల్యే తాంజీన్ ఫాతిమా గత ఏడాది డిసెంబర్ లో బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇక, గతేడాది ఫిబ్రవరి నుంచి సీతాపూర్ జైలులో ఉన్న ఆజం ఖాన్.. అతని కుటుంబసభ్యులపై భూ ఆక్రమణలు, కబ్జాలు, విద్యుత్ చౌర్యం, అణిచివేత వంటి అనేక అభియోగాలున్నాయి.