నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. వరుసగా మూడు రోజులపాటు వర్షాలు పడితే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా భావిస్తారు. కేరళలో మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి గురువారం రుతుపవనాలు కేరళాను తాకినట్లుగా భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో బుధవారం తెలంగాణలో గాలివానలు, కోస్తాంధ్ర రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని సూచించింది.
గురువారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇక తెలంగాణపై 1500 మీటర్ల ఎత్తు వరకూ గాలుల విచ్ఛిన్నత ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. బుధవారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆరుట్ల(రంగారెడ్డి జిల్లా)లో 4.5, గచ్చిబౌలి(హైదరాబాద్)లో 4.5, ఎర్రారం(నల్గొండ)లో 4.4, దండుమైలారం(రంగారెడ్డి)లో 3.8. మాదాపూర్‌లో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.