
ఒకవైపు చూస్తే వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. మరోవైపు వివాహాలు, శిశు జననాలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సతమతమవుతోంది దక్షిణ కొరియా. తమ దేశంలో వివాహాలు, పిల్లలు కనడంపై యువత ఆసక్తి చూపించడం లేదని గుర్తించింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం తాజాగా ఓ పైలట్ ప్రాజెక్టును ప్రకటించింది. పిల్లల సంరక్షణతో పాటు ప్రజలపై ఇంటిపనుల ఒత్తిడి తగ్గించేలా చేసేందుకు.. అలాగే వారికి సాయంగా ఉండేందుకు విదేశీ సహాయకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఇళ్లలో పనిచేయడానికి ముందుగా 100 మందిని అనుమతించేలా నిర్ణయించింది. అయితే డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ మొదలతుంది. ఆ తర్వాత క్రమంగా దీన్ని పరిశ్రమలు, సంస్థలకు కూడా విస్తరించాలనే ఆలోచనలో ఉంది సౌత్ కొరియా.
వివాహాలు జరగకపోవడం.. జననాల తగ్గుదలపై ప్రభుత్వం ఇటీవలే ఓ సర్వేను చేపట్టింది. అయితే ఇందులో తెలిసింది ఏంటంటే 19 నుంచి 34 ఏళ్ల లోపు ఉన్నవారిలో సగం మందికి పైగా.. పెళ్లి తర్వాత పిల్లలను కనాల్సిన అవసరం లేదని చెప్పారు. కేవలం 36.4 శాతం మంది మాత్రమే తమకు పెళ్లి పట్ల సానుకూల దృక్పథం ఉందని తెలిపారు. అయితే వీళ్లు ఆర్థిక ఇబ్బందులు, గృహభారం, చిన్నారుల సంరక్షణ లాంటి వివిధ సమస్యలను వివరించారు. అందుకే పిల్లల సంరక్షణతో పాటుగా ఇంటి పనుల భారాన్ని తగ్గించడం కోసం ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి సిద్ధమైపోయింది సౌత్ కొరియా. 20 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న.. ఇద్దరు సంపాదిస్తోన్న జంటలతో సహా సింగిల్ పేరెంట్.. అలగే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే విదేశీ సహాయకులకు కనీస వయసు 24 ఏళ్లు ఉండాలని అధికారులు తెలిపారు. అలాగే ముఖ్యంగా వారి నేర, మాదక ద్రవ్యాల చరిత్రపై కూడా ఆరా తీయనున్నారు. పని అనుభవం, విషయం పరిజ్ఞానం.. అలాగే వివిధ భాషలపై ఉన్నటువంటి పట్టును కూడా పరిశీలన చేయనున్నారు. ఇక విశ్వసనీయమైన ఏజెన్సీల ద్వారనే వాళ్లను స్థానికుల ఇండ్లల్లో పని చేసేందుకు పర్మిషన్ ఇస్తారు. అయితే ఇలా ఈ ప్రాజెక్టును దాదాపు ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తారు. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో ప్రస్తుతం 5 కోట్ల 17 లక్షల జనాభా ఉంది. ఇప్పటికే ఇక్కడ జనాభా సంక్షోభంతో ప్రభుత్వం సతమతమవుతోంది. అగ్రికల్చర్, తయారీ రంగాల్లో చాలాకాలంగా కార్మికుల కొరత ఉంది. ఒకసారి కార్మికుల పనిగంటలను వారానికి ఏకంగా 52 నుంచి 69 వరకు పెంచింది. కానీ ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దీంతో ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సౌత్ కొరియా చేపట్టనున్న పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.