Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఒక వైపు కరోనా మహమ్మారి వెంటాడుతుంటే .. మరో వైపు ఆక్సిజన్ కొరత మరిన్ని ప్రాణాలు పోయేలా చేస్తోంది. ఇలాంటి కరోనా సంక్షోభం సమయంలో అభాగ్యులకు అంగడా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సోనూసూద్. అందరికి సాయం చేస్తూ దేవుడిలా మరిపోయాడు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు వెంటనే సాయమందిస్తు్న్నారు. తాజాగా కర్ణాటకలోని సోనూసూద్ బృందం కరోనా రోగుల పట్ల సకాలంలో స్పందించి 22 మంది ప్రాణాలు కాపాడింది. బెంగళూరులోని అరక్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్ బృందానికి అత్యవసర మెసేజ్ పంపించాడు. ఆ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక అప్పటికే ఇద్దరు పేషెంట్లు మృతి చెందగా, మరో 20 నుంచి 22 మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.
అత్యవసర సందేశం అందుకున్న వెంటనే స్పందించిన సోనూసూద్ బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్ ఆస్పత్రికి 16 ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచింది. అయితే వాలంటీర్ల కృషిని సోనూసూద్ ప్రశంసించారు. ఇది టీంవర్క్‌కు నిదర్శనం. ఇలాగే పని చేస్తూ దేశ ప్రజలందరికి అండగా ఉంటాం. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణన్ నుంచి సందేశం రాగానే పరిస్థితిని తెలుసుకుని కొన్ని నిమిషాల్లోనే ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాం. ఇందులో ఏ మాత్రం ఆలస్యం జరిగినా వారి ప్రాణాలో పోయేవి. వారిని కాపాడిన అందరికీ ధన్యవాదాలు అని సోనూసూద్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే ఇంత మంది ప్రాణాలు కాపాడినందుకు ఆస్పత్రి వైద్యులు, రోగుల కుటుంబాలు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.