విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం పలు సందర్భాల్లో వికటిస్తోంది. ఈ భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు కోకొల్లలు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా మయూరేశ్వర్ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఘటన చోటు చేసుకుంది.
మధ్యాహ్న భోజనంలో ఏకంగా ఓ పాము పిల్ల వచ్చింది. పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని హుటాహుటిన రామ్‌పూర్‌హట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. పప్పు నింపిన కంటైనర్‌లో పాము కనిపించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పాఠశాలపై దాడి చేశారు. ఉపాధ్యాయుడి వాహనాన్ని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు విచారణకు ఆదేశించారు.