రిటైర్డ్ టీచర్ల ఫిర్యాదు.. జిల్లా అధికారిని ఫోన్‌‌లో మందలించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తర ప్రదేశ్‌లో తాను ప్రాతినిథ్యంవహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు.

రిటైర్డ్ టీచర్ల ఫిర్యాదు.. జిల్లా అధికారిని ఫోన్‌‌లో మందలించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
Union Minister Smriti Irani
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 30, 2023 | 4:10 PM

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తర ప్రదేశ్‌లో తాను ప్రాతినిథ్యంవహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొందరు రిటైర్డ్ స్కూల్ టీచర్లు స్మృతి ఇరానీని కలిసి.. తమకు వేతన బకాయిలు చెల్లించలేదని మొరపెట్టుకున్నారు. దీనిపై జిల్లా అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను ఇవాళే విడుదల చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ విషయంలో కాస్త మానవత్వాన్ని చూపించాలంటూ సదరు అధికారిని సున్నితంగా మందలించారు. జిల్లా అధికారితో స్మృతి ఇరానీ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

జిల్లా అధికారితో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..

ఇది అమేథీ.. ఎవరైనా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు ఫిర్యాదు చేయొచ్చని స్మృతి ఇరాన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్మృతి.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జిల్లా అధికారితో మాట్లాడి పెండింగ్ జీతభత్యాలను విడుదల చేయాలని కోరడం ఆసక్తికరంగా మారింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలో ఉండటం తెలిసిందే.

మున్షిగంజ్‌లో స్థానిక ప్రజలు కేంద్ర మంత్రిని కలిసి.. తాము ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో ఎంపీగా అమేథీలో పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపినట్లు తెలిపారు. అయితే రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు 15 ఏళ్లు ఎంపీగా ఉన్నా.. అమేథీ ప్రజల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మున్షిగంజ్‌లో తనకు గెస్ట్ హౌస్ నిర్మించుకోవడం తప్ప రాహుల్ గాంధీ స్థానిక ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. తమ ప్రభుత్వం పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధిని రాహుల్ పట్టించుకోలేదని ఆరోపించారు. అమేథీ నియోకవర్గంలో సరిగ్గా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.