Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలాపై కాల్పులు జరిపిన ఇద్దరు షార్ప్ షూటర్ల అరెస్టు.. గుజరాత్‌లో..

|

Jun 21, 2022 | 6:09 AM

నిందితులు హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ప్రియవ్రత్ అలియాస్ ఫౌజీ (26), ఝజ్జర్ జిల్లాకు చెందిన కాశీష్ (24), పంజాబ్‌లోని భటిండా నివాసి కేశవ్ కుమార్ (29)గా ధలివాల్ తెలిపారు.

Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలాపై కాల్పులు జరిపిన ఇద్దరు షార్ప్ షూటర్ల అరెస్టు.. గుజరాత్‌లో..
Sidhu Moosewala Murder Case
Follow us on

Sidhu Moosewala Murder Case: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధూపై కాల్పులు జరిపి హత్య చేసిన ఇద్దరు షార్ప్ షూటర్లను, మరొకరిని ఢిల్లీ పోలీసులు గుజరాత్‌లోని కచ్‌లోని ముంద్రా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ షూటర్లను ప్రియవ్రత్‌ ఫౌజీ, కాశిష్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చీఫ్ హెచ్‌జీఎస్ ధలివాల్ మీడియాతో మాట్లాడారు. నిందితులు హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ప్రియవ్రత్ అలియాస్ ఫౌజీ (26), ఝజ్జర్ జిల్లాకు చెందిన కాశీష్ (24), పంజాబ్‌లోని భటిండా నివాసి కేశవ్ కుమార్ (29)గా ధలివాల్ తెలిపారు.

హర్యానాకు చెందిన ప్రియవ్రత్‌ ఫౌజీ గతంలో రామ్‌కరణ్‌ గ్యాంగ్‌లో షూటర్‌గా పనిచేశాడని తెలిపారు.. మూసేవాలాను హత్యచేసిన రోజు కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌తో పలుమార్లు ముచ్చటించినట్లు ధలివాల్ తెలిపారు. గతంలో రెండు హత్య కేసుల్లో ఫౌజీ నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. కాశిష్‌ సైతం మూసేవాలాపై కాల్పులు జరిపి హత్యకు పాల్పడ్డాడని, అతడిపై గతంలోనూ పలు కేసులున్నట్లు ధలివాల్‌ వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది షూటర్లను గుర్తించామని.. వీరంతా రెండు వాహనాల్లో సిద్దూ మూసేవాలా వాహనాన్ని వెంబడించి, కాల్పులు జరిపినట్లు తెలిపారు. అంతకుముందు సంతోష్‌ జావద్‌ అనే షూటర్‌ను అదుపులోకి తీసుకొని 13 పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. పంజాబ్ ప్రభుత్వం మూసేవాలాకు భద్రతను తగ్గించిన 24 గంటల లోపే గ్యాంగ్‌స్టర్లు కాల్చిచంపడం సంచలనంగా మారింది. సిద్ధూ మూసేవాలా పూర్వీకుల స్వగ్రామమైన మాన్సాకు ఎస్‌యూవీలో వెళ్తుండగా మే 29న సుమారు 10 నుంచి 12 మంది వ్యక్తులు అతన్ని అడ్డుకుని 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మూసేవాలా అక్కడికక్కడే మరణించగా.. ఆయన మిత్రులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..