జమ్మూ కశ్మీర్ రైతులకు గుడ్ న్యూస్! పూర్తి కావొస్తున్న ప్రాజెక్ట్..
జమ్మూ కశ్మీర్-పంజాబ్ సరిహద్దులోని రావి నదిపై నిర్మాణంలో ఉన్న షాపూర్ కండి ఆనకట్ట చివరి దశకు చేరుకుంది. ఈ ఆనకట్ట పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లోని లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. పాకిస్థాన్‌కు ప్రవహించే అదనపు నీటిని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. విద్యుత్తు ఉత్పత్తిలోనూ ఇది సహాయపడుతుంది.

జమ్మూ కశ్మీర్ – పంజాబ్ సరిహద్దున పఠాన్‌కోట్ జిల్లాలోని రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి ఆనకట్ట చివరి దశకు చేరుకుంది. దానిపై పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ఆనకట్ట నిర్మాణం పంజాబ్, జమ్మూ కశ్మీర్ రైతులకు గొప్ప ఉపశమనాన్ని అందించడమే కాకుండా, రావి నది ద్వారా పాకిస్తాన్‌కు ప్రవహించే అదనపు నీటికి అడ్డుకట్ట వేస్తుంది. సింధు జల ఒప్పందం ప్రకారం భారతదేశం తన నీటి హక్కులను పూర్తిగా ఉపయోగించుకునే వ్యూహంలో షాపూర్ కండి ఆనకట్ట భాగం.
1960లో భారత్- పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జల ఒప్పందం ప్రకారం, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీరు పూర్తిగా భారతదేశం నియంత్రణలో ఉంది. అయినా దశాబ్దాలుగా భారత్ రావి నది నీటిని పూర్తిగా వినియోగించుకోలేదు. దీంతో ఈ నీరు ఎలాంటి పాకిస్తాన్‌లోకి ప్రవహించింది. ఇప్పుడీ ప్రవాహాన్ని షాపూర్ కండి ఆనకట్ట ద్వారా నిలిపివేస్తున్నారు. 0.215 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యమున్న ఆనకట్ట పూర్తయిన తర్వాత పంజాబ్‌లోని లక్షా18 వేల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం మెరుగుపడుతుంది, అదే సమయంలో 37వేల 173 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి సదుపాయం సమకూరుతుంది.
అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తర్న్ తరణ్, పఠాన్‌కోట్ రైతులు ఈ ఆనకట్టతో ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. జమ్మూకశ్మీర్‌కు కూడా కొత్త ఆశలు మోసుకొచ్చింది షాపూర్ కండి ఆనకట్ట. ఈ ఆనకట్టతో కథువా, సాంబా జిల్లాల్లో 5వేల హెక్టార్ల భూమికి నీటిపారుదల సాధ్యమవుతుంది. విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఈ ఆనకట్టు కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఆనకట్ట సరిహద్దుల్లో భద్రతా వ్యవస్థ నిర్వహణను మెరుగుపరుస్తూనే, రావి నది నుంచి ఇన్నేళ్లూ లబ్ధిపొందిన పాకిస్తాన్ ఆశలకు గండికొడుతుంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నీటి కొరతను ఎదుర్కొంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




