Maharashtra: మహారాజకీయంలో పేలుతున్న మాటల తూటాలు.. ఒకరి తర్వాత ఒకరు.. చివరికి ఎక్కడికి చేరేనో..

రాహుల్ గాంధీ సావర్కర్ కామెంట్లతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వీటికి తోడు.. శివాజీ మహారాజ్ ను నితిన్ గడ్కరీతో పోలిక.. మరో కొత్త వివాదం రాజేసింది. ఇంతకీ ఏమిటా మహా రాజకీయాల మహా మలుపు.. మతలబు ఇదేనా..

Maharashtra: మహారాజకీయంలో పేలుతున్న మాటల తూటాలు.. ఒకరి తర్వాత ఒకరు.. చివరికి ఎక్కడికి చేరేనో..
Maharashtra
Follow us

|

Updated on: Nov 21, 2022 | 7:20 PM

మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈ సమయంలో సావర్కర్ పై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారాయన. సావర్కర్ బ్రిటీష్ వారికి భయపడి క్షమాభిక్ష కోరారనీ.. గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్ర్య సమర యోధులకు తీరని ద్రోహం చేశారనీ ఆరోపించారు. వీటిపై కాంగ్రెస్ మిత్ర పక్షమైన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాహుల్ చేసిన యాంటీ సావర్కర్ కామెంట్లకు నిరసనగా.. కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అగాడి నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తోంది ఉద్ధవ్ వర్గం. రాహుల్ ఈ మాటలన్న వెంటనే ఉద్ధవ్ తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రులకు ఆరాధ్యుడు సావర్కర్. ఆయనపై వ్యతిరేక వ్యాఖ్యలు సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జోడో యాత్రలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే సైతం రాహుల్ తో కలిసి నడిచారు. ఆదిత్య కూడా సరిగ్గా ఇలాగే స్పందించారు. రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని.. ఉద్ధవ్ వర్గం సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ సైతం అన్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే.. బ్రిటీషర్ల నుంచి సావర్కర్ 60 రూపాయల ఫించన్ తీస్కున్నారంటూ మరో వివాదం రేకెత్తించారు..

ఉద్ధవ్ కు సావర్కర్ పై ఏ మాత్రం గౌరవమున్నా.. కాంగ్రెస్ కు తక్షణమే గుడ్ బై చెప్పాలని.. కేంద్ర మంత్రి, బీజేపీ నేత రావ్ సాహెబ్ డిమాండ్ చేశారు. ఈ వేడి చల్లారక ముందే గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ మరోసారి ఈ తేనెతుట్టె కదిల్చాడు. సావర్కర్ బ్రిటిష్ వారికి సహకరించడం మాత్రమే కాదు, గాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సేకి తుపాకీ ఇచ్చింది సావర్కరేనని ట్వీట్ చేశారు. బాపూ హత్యకు రెండ్రోజుల ముందు వరకూ గాడ్సే దగ్గర తుపాకీ లేదని అన్నారాయన.

ఇదిలాగుంటే.. మహారాజకీయాల్లో మరో మహా కుదుపు నమోదైంది. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం.. హిందూ సామ్రాజ్య స్థాపకుడిగా పేరున్న శివాజీ మహారాజ్ విగ్రహం పాతబడి పోయిందనీ. ఇప్పుడు మన రాష్ట్ర అభినవ శివాజీ మహారాజ్ మరెవరో కాదు నితిన్ గడ్కరీయే అంటూ భారీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. దీంతో మరో అలజడి చెలరేగింది. ఔరంగబాద్ లో ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు తీవ్రప్రతిస్పందన ఎదురైంది. గవర్నర్ కోశ్యారీని తొలగించాలంటూ.. రాష్ట్రపతిని కోరింది ఎన్సీపీ. ఇది ఛత్రపతి శివాజీ ప్రతిష్టను దిగజార్చడమేనంది ఎన్సీపీ. శనివారం ఔరంగాబాద్ లో అంబేద్కర్ మరాట్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ చేసిన ఈ కామెంట్లు మహా పాలిటిక్స్ లో కాక పుట్టిస్తున్నాయి.

గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రౌత్.. అధికార షిండే వర్గంతో పాటు బీజేపీని సైతం వివాదంలోకి లాగారు. గవర్నర్, షిండే వర్గం, బీజేపీ కంటే పాత ఐకాన్ ఎవరని ప్రశ్నించారాయన. ఇదిలా ఉంటే ఉద్ధవ్ వర్గానికి చెందిన మరో నాయకుడు ఆనంద్ దూబే.. మాట్లాడుతూ.. గవర్నర్ మాటల ప్రచారం చూస్తుంటే రాముడు కృష్ణుడు కూడా పాత విగ్రహాలుగా మారేలా ఉందని అన్నారాయన. ఛత్రపతి శివాజీ మాకు ఆరాధ్యదైవం మాత్రమే కాదు, స్ఫూర్తి ప్రదాత కూడా. ఆయనకు ఇతరులతో పోలికా? అంటూ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్ర బీజేపీయేతర నాయకులు. ఇవన్నీ ఇలా ఉంటే.. గతంలో కూడా కోశ్యారీ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశారు. సమర్ధ రామదాసు లేందే శివాజీ లేనే లేరంటూ ఆయన అన్న మాటలు అప్పట్లో పెను దుమారాన్ని రేపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం