కోవిద్ వ్యాక్సినేషన్ పై కేంద్రం అనుసరిస్తున్న ప్రొక్యూర్ మెంట్ పాలసీని సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. మీ నిర్వాకం కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వాటిని వాటి ఖర్మకు వదిలేశారని ఆరోపించింది. అలాగే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి డిజిటల్ డివైడ్ పై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కోవిద్ రోగులకు అత్యవసరమైన మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల లభ్యత తదితరాలపై తనకు తానుగా సుమోటో కేసును న్యాయమూర్తులు జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన బెంచ్ విచారిస్తోంది. వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నాయని, వాటి విషయం పట్టించుకోకుండా గాలికి ఎందుకు వదిలేశారని ప్రశ్నించింది. ముఖ్యంగా టీకామందుల కొరత కారణంగా రాష్ట్రాలు విదేశీ వ్యాక్సిన్ల కోసం తహతహలాడవలసిన పరిస్థితి ఏర్పడిందని కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దృష్టికి తెచ్చింది. కేంద్ర పాలసీ ఏమిటని కూడా రెట్టించి ప్రశ్నించింది. ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్స్ ని సేకరించడంలేదు..? వీటికి వేర్వేరు ధరలను ఎందుకు నిర్ణయించారు అని కూడా న్యాయమూర్తులు అన్నారు.కోవిద్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఎందుకు నిబంధన విధించారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారు దీనివల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.అటు-వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.
కాగా వ్యాక్సిన్ల కొరత పై అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే తీవ్రంగా గళమెత్తుతున్నారు. వ్యాక్సిన్ లభ్యత, కొరతలపై ఆయన కేంద్ర వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విశ్లేషకులు కోరుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Andhra Lockdown: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 10 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు
ఆ వ్యాక్సిన్ తీసుకున్నా..కానీ యాంటీ బాడీలు ఏవీ ?…సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలాపై యూపీ వాసి కేసు