చెన్నై, సెప్టెంబర్ 5: సనాతన ధర్మంపై తమిళనాడు అధికార డీఎంకే పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దానిని తక్షణమే నిర్మూలించాలన్న స్టాలిన్ వ్యాఖ్యలపై మత పెద్దలు, దేవాలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యలోని తపస్వి చావ్నీ ఆలయ ప్రధాన పూజారి మహంత్ పరంధాస్ ఆచార్య … ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి రూ.10 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. అంత డబ్బు మీకెక్కడిది అని ప్రశ్నించగా.. నేనే రూ.500 కోట్లకు అధిపతినని, అందులో రూ.10 కోట్లు చెల్లించడం పెద్ద విషయం కాదన్నాడు.
ఉదయనిధి స్టాలిన్ తలపై ప్రకటించిన రివార్డ్‌ను అవసరం అయితే మరింత పెంచుతామని, సనాతన ధర్మాన్ని హేళన చేస్తే సహించేది లేదన్నారు. స్టాలిన్‌ను చంపడానికి ఎవరూ సాహసించకపోతే నేనే అతన్ని చంపుతానన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో దేశంలో వంద కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయని, డీఎంకే మంత్రి ఉదయనిధి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మంగళవారం పేర్కొన్నారు. ఇకపోతే పరంధాస్ ఆచార్య గతంలోనూ చాలా మంది తలలపై బహుమతులు ప్రకటించి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరిలో తులసీదాస్ రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్‌ఎల్సీ స్వామి ప్రసాద్ మౌర్య తల నరికి తెచ్చిన వారికి రూ. 500 నగదు బహుమతిని ప్రకటించాడు.
పూజారి మహంత్ పరంధాస్ ఆచార్య వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పరంధాస్ ఆచార్య నా తలకు రూ.10 కోట్ల రివార్డు ప్రకటించారు. అంత డబ్బు అవసరం లేదు. నా తల దువ్వుకోవడానికి రూ.10 దువ్వెన సరిపోతుందని , తమిళనంలో చాప్ లేదా స్లైస్ అనే పదానికి జుట్టు దువ్వడం అనే అర్ధం కూడా వస్తుంది. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తేం కాదు. తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసం జీవితాన్ని పణంగా పెట్టిన కరుణానిధి మనవడినని, ఇలాంటి బెదిరింపులకు చింతించబోనని ఉదయనిధి స్టాలిన్ చురకలంటించారు. కాగా మంత్రి ఎంకే స్టాలిన్ తమిళ రాష్ట్ర దిగ్గజ నేతల్లో ఒకరైన కరుణానిధి మనవడనే విషయం తెలిసిందే. కరుణానిధి ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక మంగళవారం వెల్లూరులో డీఎంకే మద్దతుదారులు అయోధ్య పీఠాధిపతి పరంధాస్ ఆచార్య దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యను ఖండించగా, కాంగ్రెస్ సూక్ష్మ వైఖరి అనుసరిస్తోంది. కీలక పార్టీలకు చెందిన మరికొందరు సీనియర్ నేతలు మౌనంగా ఉండటం మరో విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.