నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌గాంధీ ఈడీ విచారణ వరుసగా మూడోరోజు కొనసాగుతోంది. లంచ్ విరామం తరువాత రాహుల్‌ను మళ్లీ ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళను కూడా ఉధృతమయ్యాయి. ఏఐసీసీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్‌ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే.. రాహుల్‌గాంధీ ఈడీ విచారణపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. అయితే నిరసనలు అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులు AICC కార్యాలయం లోకి దూసుకెళ్లడంపై వివాదం చెలరేగింది. గతంలో ఎన్నడు లేని విధంగా AICC కార్యాలయం లోకి చొచ్చుకెళ్లారు ఢిల్లీ పోలీసులు. కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్ట్ చేసి బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నేతలు.
ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు AICC జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా. పార్టీ కార్యాలయం లోకి పోలీసుల ఎలా వస్తారని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు AICC గేట్లను బద్దలు కొట్టి లోపలికి వచ్చారని , పోలీసులు గూండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు.
రాహుల్ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు ఏఐసీసీ కార్యాలయం దగ్గర , ఇటు ఈడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న మహిళా కాంగ్రెస్ , యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈడీ కార్యాలయం దగ్గర బారికేడ్లను ధ్వంసం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. టైర్లను కాల్చి నిరసన తెలిపారు. ఈడీ తీరుకు నిరసనగా చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్, వేణుగోపాల్, అధిరరంజన్ చౌదరి రోడ్డుపై బైఠాయించారు. ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
మరోవైపు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఎంపీ ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్, చెల్లకుమార్, అమర్ సింగ్, జయకుమార్, విజయ్ వసంత్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు, విచారణను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర పోలీసులు అరెస్టులు చేస్తున్న సమయం లోనే పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేశారు కాంగ్రెస్ ఎంపీలు.