Russia – Ukraine War: ఉక్రెయిన్‌లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన.. ప్రవాసులకు కీలక సూచనలు..
రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీవ్‌లోని భారత ఎంబసీ పలు సూచనలు చేస్తూ సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రష్యా ఆధీనంలోని క్రిమియా కెర్చ్ వంతెనను ఉక్రెయిన్ కూల్చవేయడంతో ప్రతీకార దాడులు తీవ్రమయ్యాయి. రష్యా ఏకంగా 75 క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది చనిపోగా.. చాలా మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీవ్‌లోని భారత ఎంబసీ పలు సూచనలు చేస్తూ సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. రష్యా.. ఉక్రెయిన్‌లోని కీలక నగరాల్లోని భవనాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం, ఘర్షణలు పెరగడంపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. అత్యవసరం లేని ప్రయాణాలు ఉక్రెయిన్‌కు చేయవద్దంటూ సూచించింది. ఉక్రెయిన్‌లోనే ఉన్న భారతీయులు సైతం ప్రయాణాలు చేయవద్దని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వ హెచ్చరికలు, సూచనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు కీవ్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
ఇరుదేశాలు శత్రుత్వాన్ని వీడి, తక్షణమే దౌత్యం, చర్చల మార్గాన్ని అనుసరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఘర్షణలు పెరగడం ఎవరికీ మంచిది కాదన్న భారత్.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తరపున అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.
Advisory for all Indian Nationals in Ukraine@MEAIndia @DDNewslive @DDNational @PIB_India @IndianDiplomacy pic.twitter.com/oKbpxS5IWE
— India in Ukraine (@IndiainUkraine) October 10, 2022
క్రిమియాలోని వంతెనపై పేలుడు తర్వాత.. రష్యా రాకెట్ దాడులతో విరుచుకుపడుతోంది. కీవ్‌తో పాటు ఉక్రెయిన్ లోని కీలక నగరాలు రష్యా దాడులతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడికి పాల్పడిందని, దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..