
హిందూ సమాజంలోని కుల విభజనలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం (ఏప్రిల్ 20) ఓ కార్యక్రమంలో అన్నారు. కుల విభజన నిర్మూలనకు ‘అందరకీ ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశానం’ అనే సూత్రాన్ని అవలంభించడం ద్వారా సాధ్యమవుతుందని, తద్వారా సామాజిక సామరస్యం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. RSS చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుతం అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆదివారం హెచ్‌బీ ఇంటర్ కాలేజీ, పంచన్ నగరి పార్క్‌లలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ‘స్వయంసేవకులను’ ఉద్దేశించి ప్రసంగించారు. శాంతి దూతగా భారత్ తన ప్రపంచ బాధ్యతను నెరవేర్చడానికి సామాజిక ఐక్యత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
హిందూ సమాజానికి పునాదిగా భావించే ‘సంస్కారం’ (విలువలు) ప్రాముఖ్యతను కూడా మోహన్ భగవత్ వివరించారు. సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాలతో నిండిన సమాజాన్ని నిర్మించాలని ఆయన సభ్యులను కోరారు. సమాజంలోని అన్ని వర్గాలు ఇతరులను తమ ఇళ్లకు ఆహ్వానించాలని, అట్టడుగు స్థాయిలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించాలని ఆయన స్వయంసేవకులను కోరారు. కుటుంబ పాత్ర సమాజంలో ప్రాథమిక యూనిట్‌గా ఉంటుందని, బలమైన కుటుంబ విలువలు సంస్కారం నుంచే ఉద్భవిస్తాయని ఆయన అన్నారు. జాతీయవాదం, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి పండుగలను సమిష్టిగా జరుపుకోవాలని అన్నారు.
ఏప్రిల్ 17న ప్రారంభమైన మోహన్ భగవత్ పర్యటనలో బ్రజ్ ప్రాంతానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లతో వరుస సమావేశాల్లో పొల్గొన్నారు. ఈ ఏడాది విజయదశమి నాడు ప్రారంభం కానున్న ‘శతాబ్ది ఉత్సవాలు’లో భాగంగా ఆయన ఈ పర్యటన చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.