అల్లర్లు ఆగాల్సిందే.. ‘ జామియా ‘ ఘటనపై సుప్రీం.. రేపు విచారణ
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల జులుం ను పరిగణనలోకి తీసుకోవాలని, పరిస్థితి చక్కబడేట్టు చూడాలని కోరుతూ లాయర్లు ఇందిరా జైసింగ్, కొలిన్ గాన్ సాల్వేస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. పౌరసత్వ సవరణ బిల్లును (అది ఆ తరువాత చట్టమైంది) నిరసిస్తూ ఆదివారం ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. వారికి, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగిన సంగతి […]
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల జులుం ను పరిగణనలోకి తీసుకోవాలని, పరిస్థితి చక్కబడేట్టు చూడాలని కోరుతూ లాయర్లు ఇందిరా జైసింగ్, కొలిన్ గాన్ సాల్వేస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. పౌరసత్వ సవరణ బిల్లును (అది ఆ తరువాత చట్టమైంది) నిరసిస్తూ ఆదివారం ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. వారికి, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగిన సంగతి విదితమే.. ఈ అల్లర్లలో అనేకమంది విద్యార్థులు గాయపడగా.. వారు విసిరిన రాళ్లు తగిలి కొందరు ఖాకీలు కూడా గాయాలపాలయ్యారు. ఇందిరా జైసింగ్, సాల్వేస్ వేసిన పిటిషన్ పై స్పందించిన సీజేఐ.. ఎస్. ఎ. బాబ్డే… ఈ నగరంలో ఘర్షణలు తప్పనిసరిగా ఆగిపోవలసిందేనని, శాంతి నెలకొనాలని వ్యాఖ్యానించారు. ఆయా యూనివర్సిటీలవారు విద్యార్థులైనంత మాత్రాన.. పోలీసులు తమ చేతుల్లోకి లా అండ్ ఆర్డర్ ని ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. పరిస్థితి చల్లబడిన అనంతరం ఈ విషయాన్ని నిర్ణయించవలసి ఉందన్నారు. దేన్నయినా, ఎప్పుడైనా నిర్ణయించుకోవచ్ఛుననడం సముచితం కాదని, ఘర్షణలు, లేదా అల్లర్లు వెంటనే ఆగిపోవలసిందేనని వ్యాఖ్యానించారు.
అటు-విద్యార్థులపై పోలీసుల చర్యను గమనించాలని, అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఇద్దరు సుప్రీం మాజీ న్యాయమూర్తులను ఈ రెండు యువర్సిటీలకు పంపాలని లాయర్లు అభ్యర్థించారు. ‘ ఆస్తులు ఎందుకు ధ్వంసమయ్యాయి ? బస్సులను తగులబెట్టారు కూడా.. ఎవరు అల్లర్లను లేవనెత్తారు.. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం.. మొదట శాంతియుత పరిస్థితులు నెలకొనేలాచూడాల్సి ఉంది అని సీజేఐ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలని అడ్వొకేట్లు కోరారు. ఇది తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన కూడా అన్నారు. ఈ రెండు విశ్వ విద్యాలయాలకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులను పంపాలన్న విజ్ఞపై సీజేఐ…. మొదట నిరసనలు నిలిచిపోవలసిందేనని, ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నిరసనలు, హింస కొనసాగితే తాము విచారణ జరిపే ప్రసక్తి లేదన్నారు.