AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS: ప్రమాదాలు, రేప్ కేసు మృతుల కోసం కొత్త టెక్నాలజీ.. వైద్య రంగంలో ఇదో సంచలనం

ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి శవపరీక్షల పేరుతో తమవారిని ముక్కలుగా కోయడం, సుత్తితో పుర్రెను పగలగొట్టడం వంటి చర్యలు తీవ్ర మనోవేదనను మిగులుస్తాయి. ప్రమాదాలు, నేరాలు జరిగిన సమయాల్లో మరణించిన వారికి కచ్చితంగా పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో పోస్టుమార్టం పేరు వింటేనే మరణించిన వారి కుటుంబీకులు మరింత కుంగిపోతారు. అందుకే కొన్ని మెడికో లీగల్ కేసుల్లో శవపరీక్షలు నిర్వహించొద్దంటూ మృతుల బంధువులు రాజీకి సైతం వెనకాడరు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తాజాగా ఎయిమ్స్ వైద్యులు కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు.

AIIMS: ప్రమాదాలు, రేప్ కేసు మృతుల కోసం కొత్త టెక్నాలజీ.. వైద్య రంగంలో ఇదో సంచలనం
Aiims Doctors New Technology
Bhavani
|

Updated on: Apr 18, 2025 | 6:59 PM

Share

రిషికేశ్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ మెడిసిన్ రంగంలో చరిత్రాత్మక ప్రయోగం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనిష్ట ఆక్రమణ శవపరీక్ష (మినిమల్లీ ఇన్వాసివ్ ఆటోప్సీ) పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేసింది. ఈ ఆధునిక టెక్నిక్ నేర దర్యాప్తు, విచారణలను మరింత ఖచ్చితమైనవిగా చేయడమే కాకుండా, శవపరీక్ష ప్రక్రియను మానవీయంగా, గౌరవప్రదంగా మార్చనుంది. సాంప్రదాయ పద్ధతుల్లో శరీరాన్ని ఎక్కువగా కోయడం జరిగేది కానీ, ఈ కొత్త పద్ధతిలో ఎండోస్కోప్ సాయంతో పరీక్షలు నిర్వహిస్తారు.

ఎయిమ్స్ రిషికేశ్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ బినయ్ కుమార్ బస్తియా ఈ పద్ధతి గురించి వివరిస్తూ, “ఈ టెక్నిక్‌లో మృతదేహంపై మూడు చోట్ల సుమారు రెండు సెంటీమీటర్ల చిన్న రంధ్రాలు చేసి, అంతర్గత అవయవాలను పరిశీలిస్తాం. ఇప్పటివరకు శవపరీక్షల్లో శరీరాన్ని ఎక్కువగా కోసేవారు, ఆ రిపోర్టులను కాగితంపై అందించేవారు. కానీ ఈ కొత్త పద్ధతి శాస్త్రీయంగా అధునాతనమైనది మరింత గౌరవప్రదం” అని తెలిపారు.

డాక్టర్ బస్తియా మాట్లాడుతూ, ఈ టెక్నిక్ ఏప్రిల్ 14న ప్రారంభమైందని, అధిక రిజల్యూషన్ లాపరోస్కోపిక్ కెమెరాల సాయంతో అంతర్గత గాయాలు, హానిని ఖచ్చితంగా గుర్తించవచ్చని వెల్లడించారు. లైంగిక వేధింపుల వంటి సున్నితమైన కేసుల్లో ఈ పద్ధతి గౌరవప్రదంగా, వివరణాత్మక పరిశీలనను అందించి, కీలక సాక్ష్యాల సేకరణకు తోడ్పడుతుందన్నారు.

విషం లేదా మత్తుపదార్థాల వినియోగం సంబంధిత కేసుల్లో, ఎండోస్కోపిక్ సాధనాలతో నోటి, ముక్కు లోపలి భాగాలను గాయం లేకుండా పరీక్షిస్తామని ఆయన వివరించారు. ఈ ప్రక్రియ మొత్తం రికార్డ్ చేస్తారు. దీనివల్ల న్యాయపరమైన దర్యాప్తుకు పారదర్శక డాక్యుమెంటేషన్, వైద్య విద్యకు ఉపయోగపడే సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ఆవిష్కరణ ఫోరెన్సిక్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నిపుణులు భావిస్తున్నారు.