పంజాబ్, మార్చి 6: పంజాబ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన ఓ ఉద్యోగి వినూత్నంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఏకంగా తన సర్వీసుకు గుర్తుగా తన ఇంటిపై బస్సును ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విచిత్ర ఘటన పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. పంజాబ్‌కు చెందిన రేషమ్ సింగ్ (71) ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. తన సర్వీసుకు గుర్తుగా కపుర్తలాలోని కాంగ్ సాహ్బు గ్రామంలోని తన ఇంటి పైకప్పుపై ఏకంగా ఓ బస్సును ఏర్పాటు చేసుకున్నాడు. తాను ఉద్యోగం చేసిన పంజాబ్ రోడ్‌వేస్‌కు కృతజ్ఞతగా ఈ బస్సును ఏర్పాటు చేసినట్లు సింగ్ మీడియాకు తెలిపాడు. దాదాపు 2.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బస్సులో.. సాధారణ ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుగానే స్టీరింగ్, సీట్లు, ఎల్‌ఈడీ లైట్లు వంటి అన్నీ సదుపాయాలు ఉన్నాయి. తెలుపు, నీలం రంగులో పెయింట్ చేసిన ఈ బస్సు విండ్ షీల్డ్‌పైన పీఆర్‌టీసీ అనే అక్షరాలు బస్సుపై ముద్రించారు. ప్రతి పంజాబ్ రోడ్‌వేస్ బస్సులో ఈ అన్ని సదుపాయాలు ఉంటాయి. వీటితోపాటు విధి నిర్వహణలో తనకు లభించిన జ్ఞాపికలు, తనతోపాటు పనిచేసిన సహోద్యోగుల పేర్లను చెక్కించి బస్సులో అందంగా అలంకరించాడు.
‘నేను ఆర్టీసీ టెక్నికల్ విభాగంలో 40 నుంచి 45 యేళ్లపాటు సుధీర్ఘకాలం సేవలందించాను. 2013లో పదవీ విరమణ పొందాను. పంజాబ్ రోడ్‌వేస్‌లో చేసిన ఉద్యోగం ద్వారా కొంత ఆస్తి కొనుగోలు చేశాను. నా సర్వీసుకు గుర్తుగా ఇంటిపై బస్సును ఏర్పాటు చేయాలనుకున్నాను. 2018 నుంచే ఈ పనిని ప్రారంభించినప్పటికీ.. కరోనా కారణంగా మధ్యలో కొంత ఆటంకం కలిగింది. కరోనా తర్వాత మళ్లీ పనులు ప్రారంభించాను. ఇన్నాళ్లకు నా కలనెరవేరింది’ అని రేషమ్ సింగ్ తెలిపారు. తన తర్వాత తన సంతానం ఈ బస్సును తన వారసులు సంరక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రేషమ్ సింగ్ తన ఇంటిపై బస్సు ఉన్న ఫోటో, అందుకు సంబంధించిన వార్తను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థపై తనకున్న అభిమానాన్ని ఒక రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఇలా వినూత్నంగా తెలియజేయడం అభినందనీయమని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు తమ సంస్థ బస్సులపై మమకారం ఎక్కవని, విధి నిర్వహణలోనే కాకుండా.. రిటైర్డ్ అయ్యాక కూడా అదే ప్రేమను కనబరుస్తారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి రేషమ్ సింగ్ విధి నిర్వహణలో బస్సుతో తనకున్న అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇంటిపై ఏకంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశాడంటే.. ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.