Cloudbrust: ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ ఆలయం సమీపంలో మంచుచరియలు విరిగిపడ్డాయి. అలాగే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం ఆలయ గుహకు సమీపంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాల్లో సంభవించిన మేఘాల విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్), భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు చాలా మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్లు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. రెస్క్యూ టీమ్ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు చాలా మృతదేహాలు లభ్యమయ్యాయి. వదరల్లో కొట్టుకుపోయిన చాలా మందిని రక్షించారు. పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలాలకు బయలుదేరి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కార్గిల్ జిల్లా, కిష్త్వా జిల్లా తదితర జిల్లాల్లో భారీగా వరదలు, క్లౌడ్ బరస్ట్ కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక చిన్న ప్రాంతంలో (ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు) ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దానిని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేము.
ఇది భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జమ్మూలో రుతుపవనాల ప్రభావం, పశ్చిమం నుంచి వాతావరణ అలజడి (వెస్ట్రన్ డిస్టర్బెన్స్) రెండూ ఉన్నాయి. రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. అయితే వెస్ట్రన్‌డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తీసుకువస్తాయి. ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. అందు వల్ల ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి. పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.