ఢిల్లీ, జనవరి 26: దేశ రాజధాని ఢిల్లీ చూట్టూ భద్రతా బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. ఢిల్లీ రోడ్లు త్రివర్ణపతాకమయం అయ్యాయి. రిపబ్లిక్ డే వేడుకలకు 14 వేల మంది పోలీసులు, 2 వేల సీసీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేశారు. కర్తవ్య పథ్ వద్ద 2500 పోలీసుల మోహరించారు. సెంట్రల్ ఢిల్లీలో ఏకంగా 8,000 మంది పోలీసుల మోహరించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ప్రారంభమైన రిపబ్లిక్ డే పరేడ్ ఎర్ర కోట వరకు కొనసాగుతుంది. 77 వేల మంది పరేడ్ చూసేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు రిపబ్లిక్ డే పరేడ్ కొనసాగనుంది. సెంట్రల్ ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం పరేడ్ ముగిసేవరకు ఆంక్షలు విధించారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు ‘వికసిత్ భారత్- భారత్ లోక్ తంత్రకి మాతృక’ థీమ్ తో జరుగుతున్నాయి.
రిపబ్లిక్ డే పరేడ్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చీఫ్ గా హాజరవుతున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు రైతులను, కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులు, క్రీడాకారులు సహా మొత్తం 13 వేలమందికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. రిపబ్లిక్ డే పరేడ్లో నారీ శక్తికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. వికసిత్ భారత్- వందే భారతం థీమ్ తో 1500 మంది మహిళా కళాకారుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక మూడేళ్ల తర్వాత తొలిసారి రిపభ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటానికి అవకాశం లభించింది. డెమక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ శకటం పరేడ్‌లో దర్శనమివ్వనుంది. తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు కనిపించనున్నాయి.
డిజిటల్ క్లాసుల థీమ్ తో ఏపీ శకటం పరేడ్‌లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానలపై ఏపీ శకటం ప్రదర్శించనుంది. ఢిల్లీ లో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన ఉంది. మొత్తం 16 రాష్ట్రాలు, 9 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు పరేడ్‌లో కనువిందు చేయనున్నాయి. త్రివిధ దళాల కవాతులు, మహిళా సైనికుల బుల్లెట్ విన్యాసాలు, వాయుసేన విమానాల ఫ్లై పాస్ట్ అబ్బురపరచనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.