Ratan Tata’s Journey: 110 దేశాల్లో విస్తరించిన ‘టాటా’ సామ్రాజ్యం.. అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపార దిగ్గజం

|

Oct 10, 2024 | 10:23 AM

నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్‌టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని..

Ratan Tatas Journey: 110 దేశాల్లో విస్తరించిన టాటా సామ్రాజ్యం.. అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపార దిగ్గజం
Ratan Tata's Life Journey
Follow us on

ముంబై, అక్టోబర్ 10: నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్‌టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్‌ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెళ్లారు. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

సోమవారం రతన్‌ టాటా ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రెండ్రోజులకే ఆయన దివంగతులయ్యారు.

1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్‌ టాటా.. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్‌ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. దేశ పారిశ్రామిక, వాణిజ్యరంగ పురోగతిలో కీలకపాత్ర పోషించిన రతన్‌ టాటా దిగ్గజ వ్యాపారవేత్తగా, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. టాటా గ్రూప్స్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.