Ratan Tata: రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?

|

Oct 10, 2024 | 10:00 PM

అద్దాల మేడలో, ధగధగలాడే లైటింగ్స్‌ మధ్య.. ఉన్నోళ్లు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకోగలరేమో అనుకునేలా ఉంటుందది. లోపలికి ఎంటర్‌ అయితే.. పేదవాళ్లు సైతం 150 రూపాయలు పెట్టి ఓ బ్రాండెడ్‌ టీ-షర్ట్‌ కొనుక్కోగలిగినంత రేట్లు ఉంటాయి. అదే జూడియో. ఇక జాగ్వార్ అండ్‌ ల్యాండ్‌ రోవర్..

Ratan Tata: రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
Ratan Tata Immortal Bg Jpeg
Follow us on

అద్దాల మేడలో, ధగధగలాడే లైటింగ్స్‌ మధ్య.. ఉన్నోళ్లు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకోగలరేమో అనుకునేలా ఉంటుందది. లోపలికి ఎంటర్‌ అయితే.. పేదవాళ్లు సైతం 150 రూపాయలు పెట్టి ఓ బ్రాండెడ్‌ టీ-షర్ట్‌ కొనుక్కోగలిగినంత రేట్లు ఉంటాయి. అదే జూడియో. ఇక జాగ్వార్ అండ్‌ ల్యాండ్‌ రోవర్. హై-నెట్‌వర్త్‌ ఉన్నోళ్లు మాత్రమే కొనగలిగే లగ్జరీ కార్లు అవి. అంటే.. పేదోళ్లకి, ఉన్నోళ్లకి మధ్య తేడా గమనించి దానికి తగ్గట్టుగా వ్యాపారం చేసే ఒకే ఒక్క బిజినెస్‌మాన్ రతన్‌ టాటా. వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో చేసినా సరే.. సామాన్యుడి సైతం దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసే ఒకే ఒక్కడు రతన్‌ టాటా. ‘ఇలాంటి వ్యక్తి ఇంతకుముందు లేరు, ఇకపై ఉండరు’.. రతన్‌ టాటా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతకు మించి చెప్పలేం. అయినా సరే.. ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ర

ఆనందం అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కో డెఫినేషన్ ఇస్తారు. కాని, రతన్‌ టాటా ఇచ్చిన నిర్వచనం.. అనిర్వచనీయం. Indefinable అంతే. రతన్‌ టాటాను ఓ స్నేహితుడొచ్చి హెల్ప్‌ అడిగారు. ‘నాకు తెలిసిన దివ్యాంగులు ఉన్నారు, రఫ్‌గా ఓ 200 మంది ఉంటారు, వాళ్లకి వీల్‌ ఛైర్స్‌ కొనిస్తావా’ అని. అడక్కుండానే సాయం చేసే మేరునగధీరుడు మన రతన్‌ టాటా. అడిగితే కాదంటారా. వీల్‌ చైర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేసే రోజు టాటాను కూడా రమ్మన్నారు ఆ స్నేహితుడు. పంపిణీ అయిపోయింది. ఓ దివ్యాంగుడు వచ్చి రతన్‌ టాటా కాలు పట్టుకున్నాడు. ‘ఏం నాన్నా.. ఏమైనా కావాలా’ అని అడిగారు టాటా. ‘ఏమీ వద్దు సార్.. కాసేపు మీ ముఖాన్ని అలా చూడనివ్వండి’ అని అడిగాడా దివ్యాంగుడు. ఎందుకో తెలుసా.. ఎప్పుడైనా స్వర్గంలో మిమ్మల్ని చూస్తే నేను గుర్తుపట్టాలి కదా, ఈ వీల్ ఛైర్ ఇచ్చినందుకు మళ్లీ థ్యాంక్స్‌ చెప్పాలి కదా.. అంటే, మీ ముఖం నాకు బాగా గుర్తుండాలి కదా, అందుకే మిమ్మల్ని కాసేపు ఇలాగే చూడనీయండి’ అన్నాడు. రతన్‌ టాటా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఓసారి ఆ దివ్యాంగులందరినీ తేరిపారా చూశారు. ఆ వీల్‌చైర్లు తమకేదో రెక్కలు ఇచ్చినట్టు.. పక్షుల్లా విహరించడం మొదలుపెట్టారు. వాటితో రన్నింగ్ రేస్‌ పెట్టుకున్నారు. ఆ దివ్యాంగుల ముఖాల్లో ఆ రోజు చూసిన ఆనందాన్ని అలాగే గుండెల్లో నింపుకున్నారు. అప్పుడు చెప్పుకున్నారు.. ‘ఆనందం అంటే మరొకరి జీవితంలో ఆనందాన్ని చూడ్డమే’ అని.

రతన్‌ టాటా కాదు ఆయన ‘రత్న’ టాటా. పుట్టుక పార్సీ అయినా పదహారణాల భారతీయుడు. స్కూల్‌ పుస్తకాల్లో కచ్చితంగా ఉండాల్సిన ఓ పాఠ్యాంశం. నిఖార్సైన దేశభక్తుడు. దేశభక్తినంతటినీ త్రాసులో ఓవైపు పెట్టి, రతన్‌ టాటాను మరోవైపు కూర్చోబెడితే మొగ్గు టాటా వైపే ఉంటుంది. అసలైన ఆనందానికి పేరు.. రతన్‌ టాటా. ఈ దేశంలో వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నారు. కానీ రతన్ టాటా లాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు.

ఎవరో అన్నారు.. రతన్ టాటా అంటే మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం అని. ఎంత అద్భుతమైన మాట. అందులోని ప్రతి అక్షరానికి బంగారు బహుమతి ఇవ్వాల్సినంత మాట అది. అందుకు వందకు నూటొక్క శాతం అర్హులు టాటా. ఓ రియల్ ఇన్సిడెంట్‌ చెప్పుకుందాం. కరోనా మహమ్మారి లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న టైమ్‌ అది. ఆ సమయంలో టాటా స్టీల్‌ నుంచి ఓ లెటర్‌ వచ్చింది. అది నాట్‌ జస్ట్ ఏ లెటర్.. ఇట్స్‌ ఏ హోప్. కంపెనీ నుంచి వచ్చే సాధారణ లేఖ కాదు.. టాటా స్టీల్‌ కంపెనీలో పనిచేసే దాదాపు 30వేల మందికి పైగా ఉద్యోగులకు రతన్‌ టాటా ఇచ్చిన భరోసా. ఏముందో తెలుసా ఆ లెటర్‌లో. ‘దురదృష్టంకొద్దీ కరోనాతో ఏ ఉద్యోగి అయినా చనిపోతే.. ఆ ఉద్యోగిని బతికి ఉన్నట్టుగానే లెక్కలోకి తీసుకుని.. రిటైర్మెంట్‌ వరకు ప్రతి నెలా జీతం ఇస్తూనే ఉంటాం. ఒక్క జీతమేనా.. కాదు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు హౌజింగ్‌ ఫెసిలిటీ, మెడికల్‌ ఫెసిలిటీ, కెరీర్‌ పరంగా వచ్చే బెనిఫిట్స్ అన్నీ రిటైర్మెంట్‌ వరకు అలాగే కొనసాగిస్తాం’ అని భరోసా ఇస్తూ ఓ లేఖ వచ్చింది. కంపెనీలో ఫ్రంట్‌లైన్‌ ఎంప్లాయిస్‌ గనక చనిపోతే.. వాళ్ల పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు చదివిస్తాం అంటూ హామీ ఇచ్చింది. ఓ వ్యక్తి చనిపోవడం అంటే అర్థం.. ఆ కుటుంబంలోని సంతోషాలన్నింటినీ తీసుకెళ్లిపోవడమే. ఆ వ్యక్తి లేని లోటును, ఆ సంతోషాలను ఎవరూ తిరిగి తీసుకురాలేరు. కాని, మానవత్వం చూపించొచ్చు. ఆ మానవత్వాన్నే పంచారు రతన్‌ టాటా. ఇప్పుడు చెప్పండి.. రతన్ టాటా అంటే అందరూ జరుపుకోవాల్సిన ఓ ఉత్సవమే కదా.

రతన్‌ టాటా తన కారును తనే డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తారు. ఓ 30, 40 కిలోమీటర్ల వరకైతే ఓకే. కాని ఓసారి 150 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. అది కూడా 83 ఏళ్ల వయసులో. ఎందుకో తెలుసా. తన కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుడికి ఒంట్లో బాగోలేకపోతే.. వెళ్లి పలుకరించడానికి. పైగా అది కరోనా టైమ్. పోనీ అతనేమైనా సీనియర్‌ మోస్ట్‌ ఎంప్లాయా అంటే.. అదేం కాదు. కాని, వెరీ టాలెంటెడ్ ఎంప్లాయ్. అందుకే, ముంబై నుంచి పుణెకు తానే స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి మరీ ఆ ఉద్యోగిని పరామర్శించారు. రతన్‌ టాటాకు ఉద్యోగులు, వాళ్ల యోగక్షేమాలే ముఖ్యం. డబ్బు సంపాదన అంతా తరువాత సంగతి. ఎవరో ఫొటో తీసి విషయం షేర్ చేశారు గానీ.. లేకపోతే ఈ విషయం బయటకు వచ్చేదే కాదు. అసలు బయటకు రాని ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఇంకెన్ని ఉండి ఉంటాయో.

సంపద ఉన్నా ఆడంబరాలకు పోని వ్యాపారదిగ్గజం ఎవరైనా ఉన్నారా అంటే.. ప్రపంచంలో అలాంటి అరుదైన వ్యక్తి ఒక్క రతన్‌ టాటానే కనిపిస్తారు. బహుశా.. ఆస్తులు ఉన్నది అనుభవించడానికే అనే డీఎన్‌ఏ టాటాల రక్తంలోనే లేదేమో. ఎందుకంటారా..! జిమ్మీ టాటా లైఫ్‌ స్టైల్‌ కూడా అంతే సింపుల్‌గా ఉంటుంది కాబట్టి. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా రతన్‌ టాటా పదవీ విరమణ చేసినప్పుడు ఆయన వారసుడు ఎవరా అని వెతికితే.. జిమ్మీ టాటా పేరు బయటికొచ్చింది. రతన్‌ టాటాకు స్వయనా తమ్ముడు. ఎన్ని ఆస్తులున్నా ఓ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లోనే ఉన్నారు రతన్‌ టాటా. జిమ్మీ టాటా అయితే.. జస్ట్‌ డబుల్‌బెడ్‌ రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆయనక్కూడా ఆడంబరాలంటే తెలీదు, ఆయన పేరు మీద ఆస్తులున్నా ఏనాడూ ఆ దర్పం ప్రదర్శించలేదు. కనీసం ఓ మొబైల్ కూడా లేదు. సింపుల్‌గా చెప్పాలంటే.. ‘మేం ధనవంతులం’ అనే లక్షణం టాటాల బ్లడ్‌లోనే లేదు.

ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం.. ప్రపంచ బిలియనీర్లలో 200 మంది భారతీయులు ఉన్నారు. ఎలన్‌ మస్క్, జెఫ్‌ బెజోస్, మార్క్‌ జుకర్‌బర్క్, బెర్నార్డ్, బిల్‌గేట్స్.. వీళ్లంతా ప్రపంచ కుబేరులు, ధనవంతులు. కాని, ఒక్క రతన్‌ టాటా మాత్రమే ఐశ్వర్యవంతుడు. సనాతన ధర్మంలో ఐశ్వర్యం అంటే డబ్బు, బంగారం కాదు. సపోజ్‌.. ఈ భూమండలంపై ఒక వ్యక్తి పేరు, ఆయన కీర్తి, యశస్సు ఎంత వరకు విస్తరించి ఉంటే అంతవరకూ అతని రాజ్యమే అని చెబుతుంది శాస్త్రం. సింపుల్‌గా చెప్పాలంటే.. ఒక మనిషి గొప్పతనం నలుమూలలా విస్తరిస్తే.. అది తనకు కలిగిన ఐశ్వర్యం అని అర్థం. అందుకే, రతన్‌ టాటా ధనవంతుడు కాదు.. ఆయనో ఎనలేని కీర్తి, యశస్సు, పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ఓ ఐశ్వర్యవంతుడు. మన ధర్మంలో వినయం కూడా ఐశ్వర్యమే. మనిషిలో వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది. సో, వినయం అనే ఐశ్వర్యాన్ని జీవించిన ప్రతి ఘడియ పెంచుకుంటూ వచ్చిన ఐశ్వర్యవంతుడు రతన్‌టాటా. చాలామంది అంబానీ, అదానీ స్థాయికి రతన్‌ టాటా ఎందుకు వెళ్లలేదు.. ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్‌ టాటాను ఎందుకు చేర్చలేదు అని అడుగుతుంటారు. దానికి సమాధానం.. ఆయన ఐశ్వర్యవంతుడు తప్ప ధనవంతుడు కాకపోవడమే. వరల్డ్‌ బిలియనీర్స్‌ లిస్టులో రతన్‌ టాటా ఎందుకు ఉండరన్న దానికి మరో కారణం చెప్పాలిక్కడ. చాలామంది తోచినంత సాయం, చేతనైనంత సాయం చేస్తుంటారు. మరి కొందరు ట్యాక్స్‌ కోణంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద సాయం చేస్తారు. మరి కొందరు వరదలు, వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రమే సాయం అందిస్తుంటారు. కాని, రతన్‌ టాటా అలా కాదు. ఆయన సంపదలో 66 శాతం ఎప్పుడూ దాన ధర్మాలకే కేటాయిస్తారు. సమస్య వచ్చినప్పుడే సాయం చేద్దాం అనే ధోరణి రతన్‌ టాటాలో ఎప్పుడూ లేదు. అయినా.. సంపదలో 66 శాతం దానం చేయడం అంటే మాటలా..! అంబానీ, అదానీ, బిర్లా, బజాజ్‌ తరహాలో రతన్‌ టాటా ఎందుకు సంపన్నుడు కాదు అని అడిగితే.. ఇదిగో ఇందుకే.

ఇందాక వినయం అనే మాటొచ్చింది కాబట్టి.. ఫోర్డ్‌ కంపెనీ ఒకప్పటి ఛైర్మన్‌ బిల్‌ ఫోర్డ్- టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్ రతన్‌టాటా మధ్య జరిగిన ఒక యథార్ధ సంఘటన చెప్పుకోవాలిక్కడ. ఫోర్డ్‌ కంపెనీ ఆర్థికంగా చాలా ఎదురుదెబ్బలు తిని, కష్టాల్లో ఉన్న టైమ్‌ అది. ఆ సమయంలో ఫోర్డ్‌ కంపెనీకి చెందిన జాగ్వార్, లాండ్ రోవర్ అనే లగ్జరీ కార్ల యూనిట్స్‌ను కొన్నారు రతన్ టాటా. కాని, అదే ఫోర్డ్‌ కంపెనీ దగ్గరికి ఒకప్పుడు రతన్‌టాటా వెళ్లారు. టాటా ఇండికా కారు తయారీని 1998లో స్టాట్ చేశారు. రతన్ టాటా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అది. కాని, సేల్స్‌ పెద్దగా లేవు. సో, 1999లో అమెరికాలో ఉన్న ఫోర్డ్‌ కంపెనీకి వెళ్లారు రతన్‌ టాటా. వెళ్లి.. ‘తమ టాటా ఇండికా కార్లు పెద్దగా అమ్ముడుపోవట్లేదు, ఆ యూనిట్‌ను మీరు కొంటారా అని రతన్‌ టాటా అడిగితే.. కార్ల తయారీ గురించి తెలియనప్పుడు ఆ వ్యాపారంలోకి ఎందుకు దిగాలి అని బిల్‌ఫోర్డ్‌ అవహేళనగా మాట్లాడారట. వేదాంతా బిర్లా స్వయంగా షేర్‌ చేసిన విషయం ఇది. కాని, అదే ఫోర్డ్‌కు కష్టం వచ్చి భారత్‌కు వచ్చినప్పుడు.. ఆ కంపెనీని సాదరంగా ఆహ్వానించి, ఎలాంటి ప్రతీకారం చూపకుండా, వినయంతో ఫోర్డ్‌ కంపెనీకి చెందిన జాగ్వార్, ల్యాండ్‌ రోవర్ యూనిట్లను కొని, ఆ కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టారు రతన్‌ టాటా. సో, వినయం, సంస్కారం ఉన్న ఇలాంటి వ్యాపారవేత్త ఒకరు ఉన్నారని కొన్ని తరాల పాటు చెప్పుకోవచ్చు.

ప్రాణాలకు అత్యంత విలువ ఇస్తారు రతన్‌ టాటా. అది మనిషి ప్రాణమైనా, ఇతర ప్రాణుల విషయంలోనైనా. మరో రియల్‌ ఇన్సిడెంట్‌ చెప్పుకుందాం. ముంబైలోని తాజ్‌మహల్‌ హోటల్. 5-స్టార్‌ హోటల్ అది. వీకెండ్స్‌లో ఒక్క రోజుకి 46వేల రూపాయలకు పైనే ఛార్జ్ చేస్తారు. ఇక డిసెంబర్ 31st లాంటి సందర్భాల్లో అయితే.. రోజుకు 73వేలు ఉంటుంది. అలాంటి హోటల్‌ వరండాలో ఓ కుక్క పడుకుని ఉంది. ఇంట్లో పెంచుకునేది కాదది. ఓ వీధి కుక్క. ఓ రోజు ఆ హోటల్‌కు వచ్చిన ఓ హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్.. పేరు రూబీ ఖాన్.. ప్రశాంతంగా నిద్రపోతున్న కుక్కను చూసి ఆశ్చర్యపోయారు. ‘సాధారణంగా వీవీఐపీలు వచ్చే ఇలాంటి హోటల్స్‌లో అలాంటి వీధికుక్కలను రానివ్వకుండా తరిమేస్తారు కదా, మీరెందుకని తరిమేయలేదు’ అని అడిగారావిడ. ‘ఈ హోటల్‌లోకి వచ్చే వీధికుక్క అయినా, పక్షి అయినా, మరే జంతువే అయినా.. జాగ్రత్తగా చూసుకోవాలి తప్పితే ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదు’ అనే స్ట్రిక్ట్ ఆర్డర్స్‌ ఉన్నాయ్‌ మేడమ్‌’ అని రూబీ ఖాన్‌ను సమాధానం చెప్పారట ఆ హోటల్‌ స్టాఫ్. రతన్‌ టాటాలోని మానవత్వానికి ఇదో చిన్న ఎగ్జాంపుల్‌ మాత్రమే. తాజ్‌ హోటల్‌కు ప్రతి రోజు ఎంతోమంది విదేశీ అతిథులు, రాజకీయ ప్రముఖులు, సమాజంలో గొప్ప హోదాలో ఉండే వాళ్లు వస్తుంటారు. అయినా సరే.. ఓ వీధి కుక్క వచ్చింది కదా అని తరిమేయడాలు ఉండవ్ అక్కడ. ఆ హోటల్‌లోని నాలుగు గోడల మధ్యకు వచ్చే ప్రతి ప్రాణికి మనిషికి ఇచ్చినంత విలువ ఇవ్వాల్సిందే అనేది రతన్‌ టాటా ఇచ్చిన అల్టిమేట్టం. ఆ ఒక్క కుక్క విషయంలోనే కాదు. ముంబైలోని వీధి కుక్కల కోసం వందల కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగ్‌నే రాసిచ్చేశారు రతన్‌ టాటా. వాటి కోసం ఏసీ గదులు, వాటిని చూసుకోడానికి ప్రత్యేకంగా స్టాఫ్, తాజ్‌ హోటల్‌ నుంచి డైలీ ఫుడ్, చివరికి ఆ ఫుడ్‌ తీసుకొచ్చే వ్యాన్ కూడా ఏసీదేనట. పైగా.. ఆ చుట్టుపక్కల వీధి కుక్కల మెడలో ఓ రేడియం రిబ్బన్‌ ఉంటుంది. అవి కట్టించింది రతన్‌ టాటానే. డ్రైవింగ్ చేస్తునప్పుడు కనిపించలేదనే కారణంతో వీధికుక్కల ప్రాణాలు పోకూడదనేది టాటా అభిమతం. ఎలాగూ ప్రాణాలకు విలువ ఇచ్చే అంశం వచ్చింది కాబట్టి.. మరొక్క విషయం చెప్పుకోవాలిక్కడ. యాక్సిడెంట్‌ అయినప్పుడు కారులో ఉండే వాళ్లంతా సురక్షితంగా బయటకు రావాలి. అలా కారును డిజైన్‌ చేయాలి. దాని కోసం కొన్ని స్టాండర్డ్స్‌, టెస్టులు ఉన్నాయి. దాన్నే క్రాష్‌ టెస్ట్‌ అంటారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో భారతదేశం నుంచి 5/5 రేటింగ్ సాధించిన మొట్టమొదటి కారు టాటా వాళ్లదే. అంటే, నాణ్యతతో పాటు ప్రాణాలకు రతన్‌ టాటా ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పక్కర్లేదు.

డబ్బుంటే కంపెనీలు పెట్టొచ్చు ఎవరైనా. కాని, డబ్బుంది కదా అని రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ సెంటర్స్‌ పెట్టరు చాలామంది. ఎందుకంటే.. తీరా రీసెర్చ్ చేశాక అది పనికిరాదని తెలిస్తే పెట్టిన డబ్బంతా వేస్ట్‌ అవుతుందని. కాని, రతన్‌ టాటా అలా కాదు. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కోసం వందల కోట్లు ఖర్చుపెట్టారు. టాటా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా స్టీల్‌ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ రీసెర్చ్ సెంటర్, టాటా రీసెర్చ్ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్ సెంటర్, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ జెనెటిక్స్ అండ్‌ సొసైటీ.. ఇలాంటి రీసెర్‌ సెంటర్స్‌ పెట్టిన ఒకే ఒక్క వ్యాపారవేత్త రతన్‌ టాటా.

వ్యాపారంలో విలువలు అనేవి చెప్పుకోడానికే తప్ప ఎవరూ పాటించరు అంటుంటారు. చాలా వరకు అందులో నిజం ఉంది. కాని, టాటా కంపెనీల విషయంలో మాత్రం అలా ఎవరైనా అనుకుంటే అది నూటికి నూరుపాళ్లు తప్పే. నీతి, నియమాలు, నిబంధనలు.. ఇదే టాటా కంపెనీల బిజినెస్ స్ట్రాటజీ. టాటా కంపెనీ ఎప్పుడూ, ఎన్నడూ ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వలేదు అనేది బిజినెస్‌ సర్కిల్‌లో వినిపించే మాట. అందుకే ఆ కంపెనీ బిజినెస్‌ ఎక్స్‌పాన్షన్స్ కొన్ని.. కాస్త నెమ్మదిగా జరుగుతాయని అందరూ అనుకునే మాట. భారీ కాంట్రాక్టులు దక్కించుకోడానికి కొందరు బడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి, తమకు అనుకూలమైన రూల్స్‌ తెచ్చుకుంటుంటారు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కాని, టాటా గ్రూప్ అలా ఒక్కనాడు చేయలేదు. అయినా సరే.. 300లకు పైగా కంపెనీలను విజయవంతంగా నడుపుతోందంటే కారణం.. నీతి, నిజాయితీ, నిబద్ధత. ప్రజల్లో టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం. సాల్ట్‌ ప్యాకెట్ నుంచి స్టీల్‌ వరకు అత్యంత నాణ్యతతో టాటా ప్రాడక్ట్‌ ఉంటుందనే నమ్మకం. వాళ్లెప్పుడూ తప్పు చేయరు అనే నమ్మకం. ఆ సెలక్షన్‌ ఎలా ఉంటుందో తెలీదు గానీ.. టాటా గ్రూప్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా అంత కమిట్‌మెంట్‌తో ఉంటారు. ఆ గ్రూప్‌లో వేల మంది మేనేజర్లు ఉంటారు. అంతమందిలో ఒక్కరు కూడా కమీషన్ల రూపంలో గానీ, లంచం రూపంలో గానీ అవినీతికి పాల్పడ్డారన్న వార్త కంపెనీ హిస్టరీలోనే లేదు. అంతపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్క మరక కూడా లేకుండా నడపడం గ్రేట్. హ్యాట్సాఫ్‌ టు రతన్‌ టాటా.

ఇన్‌స్పిరేషన్, మోటివేషన్‌ కోసం ఏవేవో పుస్తకాలు చదువుతారు. సోషల్‌ మీడియాలో ఎవరెవరో చెప్పే కథలు వింటారు. అక్కర్లేదు.. రతన్‌ టాటా జీవతాన్ని చదివితే చాలు. ఒక జీవితానికి కావాల్సినంత మోటివేషన్, ఇన్‌స్పిరేషన్ వచ్చేస్తుంది. చివరిగా ఒక్కమాట. రతన్‌ టాటాకు పిల్లలు లేరన్న మాటే గానీ.. ఆయన కోసం దేశంలోని 145 కోట్ల మంది కన్నీరు పెడుతున్నారు. తమ నివాళులు అర్పిస్తున్నారు. వ్యాపార ప్రపంచానికి చెందిన ఒక వ్యక్తికి ఇంతటి ఘన వీడ్కోలు ఇంకెవరికీ దక్కని అదృష్టమేమో.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి