Fight Over Rasgulla: పెళ్లి వేడుకలో స్వీట్ లొల్లి.. రసగుల్లా తక్కువైందని కొట్టుకున్న అతిథులు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

|

Oct 28, 2022 | 12:15 PM

తాజాగా ఓ వివాహ వేడుకలో రసగుల్లా తక్కువయిందని జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ స్వీట్ల లొల్లి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది

Fight Over Rasgulla: పెళ్లి వేడుకలో స్వీట్ లొల్లి.. రసగుల్లా తక్కువైందని కొట్టుకున్న అతిథులు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
Wedding Ceremony In Up
Follow us on

పెళ్లి వేడుక అంటేనే సందడి.. విందు, వినోదం జీవితాంతం గుర్తుండి పోయే వేడుక ఎవరికైనా… మారుతున్న కాలంతో పాటు పెళ్లి వేడుక కూడా ఓ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. దీంతో వివాహ వేడుక విందులో రకరకాల ఆహారపదార్ధాలు చేరిపోయాయి. స్వీట్స్, ఫ్రూట్స్, వివిధ రకాల కూరలు, బిర్యానీ రైస్, ఐస్ క్రీమ్స్ ఇలా అనేక రకాలు వియ్యాల వారి విందుకి చేరుకున్నాయి. అయితే తాజాగా ఓ వివాహ వేడుకలో రసగుల్లా తక్కువయిందని జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ స్వీట్ల లొల్లి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఎత్మాద్‌పూర్‌ పట్టణంలోని మొహల్లా షాయిఖాన్‌ ప్రాంతానికి చెందిన ఉస్మాన్‌ కుమార్తె పెళ్లి వేడుక జరుగుతోంది. వివాహ వేడుకలో రసగుల్లా తక్కువ అయ్యాయి. దీంతో వధువు, వరుడు తరఫు బంధువులు రసగుల్లా కోసం గొడవకు దిగారు. స్వీట్స్ తమకు అందలేదని పెళ్లికూతురు తరపు వారితో వరుడు తరపు బంధువులు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇంతలో ఓ వ్యక్తి కత్తితో చెలరేగిపోవడంతో 22ఏళ్ల సన్నీతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. “దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీ (22)ని మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సన్నీని ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు..  అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు.

ఈ దాడిలో గాయాలపాలైన మరో ఐదుగురిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి గుప్తా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..