Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యంలో అరుదైన దృశ్యం.. ఇదో అద్భుతం

పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యంలో అరుదైన దృశ్యం కనిపించింది. జగ‌న్నాథుడి ఆల‌య శిఖ‌రంపై ఉన్న జెండాలు ముడిప‌డ్డాయి. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదో అద్భుతం, శుభ సూచకం అంటున్నారు స్థానికులు. దీన్ని సున్య గంతిగా పేర్కొంటారు. ఇది ఆధ్యాత్మిక విశ్వ‌సాల‌ను మ‌రింత బ‌ల‌ప‌రుస్తున్న‌ట్లు అర్చకులు చెబుతున్నారు.

Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యంలో అరుదైన దృశ్యం.. ఇదో అద్భుతం
Sunya Ganthi

Updated on: Mar 17, 2025 | 6:45 PM

పూరి జగన్నాథ ఆలయంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రధాన ఆలయ శిఖ‌రంపై ఉన్న జెండాలు .. తీవ్రమైన గాలుల‌కు పరస్పరం ముడిప‌డ్డాయి. ఆదివారం నాడు ఈ సంఘట‌న జ‌రిగింది. దీన్ని సున్య గంతిగా పేర్కొంటారు. ఇది మంగ‌ళ‌క‌ర‌మైన సంకేత‌మ‌ని స్థానికులు, పూజారులు చెబుతున్నారు. పూరి శ్రీమందిరంపై ఉన్న బానాలు… అంటే జెండాలు, ఒకదానిని ఒకటి అల్లుకుపోయాయి. అతివేగంగా వీచిన గాలుల వల్ల ఇలా జరిగింది. ఇలాంటి అద్భుతం జ‌ర‌గ‌డం అత్యంత అసాధార‌ణ ఘ‌ట‌న‌గా ఆల‌య పూజారులు భావిస్తున్నారు. అసలు ఈ సున్యగంతి అంటే ఏంటో తెలుసుకుందాాం.

జెండాలు ముడిపడడం అనేది అత్యంత అరుదు. ఇతిహాసాల ప్రకారం సున్యగంతి ఓ విశిష్ట ప్రక్రియ. ఇది మంగళకర సంకేతమని అర్చకులు చెబుతున్నారు. అన్ని రకాల రుగ్మతలను పారదోలే సూచనగా అభివర్ణిస్తున్నారు. ప్రజలకు దేవదేవుడు అభయమిచ్చినట్టుగా చెబుతున్నారు. భోగభాగ్యాలకు సంకేతమని అర్చకులు వివరిస్తున్నారు.

శ్రీ మందిర ఆలయ ప్రధాన శిఖరంపై ఉన్న జెండాలు బలంగా అల్లుకుపోవడం అంటే…చాలా మంచి శకునమని స్థానికులు భావిస్తున్నారు. ఆదివారం ఆల‌య ప‌రిస‌రాల్లో చాలా బ‌ల‌మైన గాలులు వీచాయి. ఆ స‌మ‌యంలో ప‌తిత‌పావ‌న జెండాలు ముడిపడడం జరిగింది. జెండాలు ముడిప‌డ‌డం అంటే జగన్నాథుడు దీవించినట్లే అంటున్నారు పండితులు. అది శ‌క్తివంత‌మైన ఆధ్యాత్మిక శోభ‌కు సంకేత‌మ‌ని భ‌క్తులు విశ్వసిస్తున్నారు. ఇక సున్య గంతి ఏర్పడ‌డం వల్ల నెగ‌టివ్ శ‌క్తులు పారిపోతాయ‌ని స్థానికుల నమ్మకం. ఇక జెండాలు అల్లిబిల్లిగా అల్లుకుపోవడం…అమిత‌మైన భాగ్యానికి సంకేతమని మరికొందరు భావిస్తున్నారు. సోమవారం ఆలయ అధికారుల ఆదేశాల మేరకు, ముడిపడ్డ జెండాలను విడదీసి, మళ్లీ ఎగురవేశారు ఆలయ సిబ్బంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.