Indian Army Forces: ఇండియన్ ఆర్మీలో ఎయిర్‌ఫోర్స్ ఎంతో కీలకం.. వాయుసేన సేవలు అనిర్వచనీయం.. ట్రైనీ పైలట్ల పరేడ్‌లో రాజ్‌నాథ్..

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. దుండిగ‌ల్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌మిలో ట్రైనీ పైల‌ట్ల ప‌రేడ్‌లో..

Indian Army Forces: ఇండియన్ ఆర్మీలో ఎయిర్‌ఫోర్స్ ఎంతో కీలకం.. వాయుసేన సేవలు అనిర్వచనీయం.. ట్రైనీ పైలట్ల పరేడ్‌లో రాజ్‌నాథ్..

Updated on: Dec 19, 2020 | 12:30 PM

Indian Army Forces: కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా దుండిగ‌ల్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌మిలో ట్రైనీ పైల‌ట్ల ప‌రేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాడెట్ల నుండి కమీషన్డ్ ఆఫీసర్లుగా బాధ్యతలు చేపట్టబోతున్న వారికి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. నేడు తాను చూసిన పరేడ్ ఎక్సలెంట్‌గా ఉందని క్యాడెట్లకు ఆయన కితాబిచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు నిత్యం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ గోల్డెన్ జూబ్లీ జరుపుకొంటుందన్నారు. ఈ అకాడమీ ఎంతో మంది వీరులను దేశానికి అందించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

ఇలాంటి పరేడ్‌లు ఫోర్స్‌లోని సిబ్బందికి మరింత బలాన్ని చేకూరుస్తుందన్న రాజ్‌నాథ్.. అకాడమీలో శిక్షణ పొందిన వియత్నాం, నైజీరియాకు చెందిన క్యాడెట్లకు అభినందనలు తెలిపారు. శత్రువులను చీల్చి చెండాడంలో వాయుసేన ప్రదర్శించిన సాహసాలు గోల్డెన్ రికార్డులు అని పేర్కొన్నారు. అకాడమీలో ఇప్పటి వరకు పొందిన అనుభవం వేరు.. భవిష్యత్‌లో జరిగే పరిణామాలు వేరు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సిద్ధంగా ఉండాలని పైలట్లకు సూచించారు. శాంతి మన దేశ నినాదం అని, అయితే.. దేశ సార్వభౌమత్వంపై ఎవరైనా మచ్చ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సైన్యం ఎనలేని పోరు చేస్తోందన్న ఆయన.. సరిహద్దుల్లోనే కాదు సరిహద్దులు దాటి మరీ తమ ధైర్య సాహసాలను ప్రదర్శించిందని కొనియాడారు. బాలాకోట్‌లో జరిగిన ఉదందం అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ నాటి సంఘటనను గుర్తు చేశారు. సైన్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారిందన్నారు. లడక్‌లో సైన్యానికి విపత్కర పరిస్థితుల్లో అన్ని రకాలుగా సహకరించిందని ఆయన పేర్కొన్నారు. వాయుసేన అందిస్తున్న సేవలు అనిర్వచనీయం అని కొనియాడిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్.. భద్రతా బలగాల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇదిలాఉండగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. శుక్రవారం నాడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనీలతో ముఖాముఖి అయ్యారు. నేడు ట్రైనీ పైలట్ల పరేడ్‌లో పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అగ్ని మిసైల్ పరీక్షను రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా పరిశీలించనున్నారు. ఇక ఆదివారం సాయంత్రం పహడీ షరీఫ్‌లో ఆర్‌సీఐలో డీఆర్‌డీవో రక్షణ పరికరాలను ఆయన పరిశీలిస్తారు.

Also read:

అదే జరిగితే పెను వినాశనం తప్పదా.! చంద్రుడి మీద హక్కుల కోసం అమెరికా, చైనా పోటాపోటీ అడుగులు ఎటువైపు?

సోనియా సమావేశం: నేడు కాంగ్రెస్‌లో ఏం జరుగబోతోంది ? ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఎలాంటి స్ట్రేటజీ.?