లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన MLA సార్.. అరెస్ట్ చేసిన పోలీసులు! ఎక్కడంటే..?
MLA Arrested For Taking Bribe: అసెంబ్లీలో మైనింగ్ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు ఓ ఎమ్మెల్యే గారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించగా.. అందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. చివరికి రూ.2.5 కోట్లకు బేరం కుదిరడంతో..

అసెంబ్లీలో మూడు ప్రశ్నలు అడగకుండా ఉండటానికి ఏకంగా రూ.20 లక్షల లంచం తీసుకున్నాడో ఎమ్మెల్యే. ఈ కేసులో పోలీసులు సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని బాగిడోరాలో చోటు చేసుకుంది. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ అసెంబ్లీలో మైనింగ్ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించగా.. అందుకు జైకృష్ణ రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. చివరికి రూ.2.5 కోట్లకు బేరం కుదిరింది. ఈ నేపథ్యంలో సదరు మైనింగ్ కంపెనీ తొలి విడతలో రూ.లక్ష ఇవ్వగా రెండో విడుతలో రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో సదరు కంపెనీ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. దీంతో అప్పమత్తమైన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యేకు ముహూర్తం పెట్టారు.
తాజాగా డబ్బు ఇచ్చేందుకు జైపూర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని సంబంధిత కంపెనీ వ్యక్తులకు ఎమ్మెల్యే జైకృష్ణ సూచించగా.. ఆయన క్వార్టర్స్‌కి ఆదివారం (మే 4) చేరుకుని రూ.20 లక్షలు అందించారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే స్వయంగా లెక్కబెట్టిమరీ దాచుకున్నాడు. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఎమ్మెల్యేను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. రాజస్థాన్ ACB చరిత్రలో అవినీతి కేసులో ఒక ఎమ్మెల్యే అరెస్టు కావడం ఇదే తొలిసారని ACB డైరెక్టర్ జనరల్ రవి ప్రకాష్ మెహర్దా అన్నారు. రవీంద్ర సింగ్ అనే వ్యక్తి ఏప్రిల్ 4న తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కాగా బన్స్వారా జిల్లాలోని బాగిడోరా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పటేల్ (38) గత ఏడాది ఉప ఎన్నికల్లో గెలుపొందారు. మైనింగ్‌కు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన మూడు ప్రశ్నలను తొలగించడానికి ఎమ్మెల్యే ఈ మేరకు లంచం డిమాండ్ చేశాడు. విడతలవారీగా చెల్లించాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఎమ్మెల్యేను పట్టుకున్నామని చెప్పారు. ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసి తీసుకున్నట్లు నిరూపించడానికి ఏసీబీ వద్ద ఆడియో, వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని, అతన్ని దోషిగా నిర్ధారించడంలో ఇవి చాలని డీజీ పేర్కొన్నారు.
భారత్ ఆదివాసీ పార్టీ (బిఎపి) కన్వీనర్, బన్స్వారా ఎంపీ రాజ్‌కుమార్ రోత్ దీనిపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు తేలితే పార్టీ అతనిపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పడం సముచితం కాదన్నారు. అయితే ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ర కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు తేలితే, పార్టీ తగిన చర్య తీసుకుంటుందని ఆయన అన్నారు. 200 మంది సభ్యులున్న సభలో బీఏపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.