ఉత్తర భారతంలో చలి తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడ్డకట్టే చలిగాలుల దృష్ట్యా రాజస్థాన్‌లోని ఉదయపూర్, బికనీర్ నగరాల్లోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో నేటి నుంచి జనవరి 18 వరకు అన్ని విద్యాసంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక అటు ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యూపీలోని గోరఖ్‌పూర్, మీరట్‌లలో కూడా జనవరి 17 వరకు పాఠశాలలను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
దేశ రాజధానితో సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత మరో రెండు రోజుల (బుధవారం వరకు) పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ఆదివారం (జనవరి 15) తెలిపింది. మరీ ముఖ్యంగా రాబోయే ఐదు రోజుల పాటు దేశ వాయువ్య భాగంలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.